కోట్ల ఆస్తి మొత్తం.. ఆ కోతిదే!

19 Feb, 2015 19:32 IST|Sakshi

పిల్లలు లేని దంపతులు ఓ కోతిని కొడుకుగా భావించారు.. నిత్యం సవర్యలు చేయడమే కాకుండా ఇప్పుడు ఏకంగా తమ ఆస్తి మొత్తాన్ని దాని పేరు మీద రాసేందుకు సర్వం సిద్ధం చేశారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో సబిష్ట (45)  న్యాయవాదిగా పనిచేస్తుండగా ఆమె భర్త శ్రీవాత్సవ (48) చిన్నవ్యాపారాలు చేసుకుంటున్నారు. వారికి ఒక ఇల్లు, 200 చదరపు గజాల్లో నివాస స్థలంతోపాటు లక్షల్లో ఆస్తి ఉంది. కానీ వారికి పిల్లలు లేరు. తల్లిని కోల్పోయిన చిన్న కోతిపిల్ల ఒకటి 2004లో తమకు తారసపడటంతో దానిని తెచ్చుకుని పదేళ్లకు పైగా దాన్ని పెంచుకుంటున్నారు.

దానికి "చున్మున్' అని నామకరణం చేసి అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న చున్మున్ తాము చనిపోతే బతకలేదని, తమ తర్వాత కూడా అది ఎవరిపైనా ఆధారపడకుండా ఉండాలని భావించి.. తమ ఆస్తి మొత్తాన్ని దాని పేరిట రాస్తున్నట్లు తెలిపారు. పైగా అది తమ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచే బాగా కలిసి వచ్చిందని చెబుతూ.. అందరిలాగే చైనీస్ ఫుడ్స్ తినడమే కాకుండా కూల్ డ్రింక్స్, టీ,  కాఫీలాంటి వాటిని కూడా అది ఫుల్లుగా లాగించేస్తుందని వాళ్లు ముద్దుగా చెబుతున్నారు. మొత్తానికి చున్మున్ మాత్రం త్వరలోనే కోటీశ్వరురాలు కాబోతోందన్న మాట!!

మరిన్ని వార్తలు