‘బోఫోర్స్‌’ కేసులో సీజేఐని తప్పించండి 

1 Feb, 2018 04:23 IST|Sakshi

సుప్రీంలో బీజేపీ నేత పిటిషన్‌  

న్యూఢిల్లీ: బోఫోర్స్‌ కుంభకోణం ముడుపుల కేసు విచారణ నుంచి సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను తప్పించాలని బుధవారం సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. బోఫోర్స్‌ కుంభకోణంలో రూ.64 కోట్ల మేర ముడుపుల కేసులో సీజేఐ పక్షపాతంతో, ఏకపక్షం గా వ్యవహరించే అవకాశముందని బీజేపీ నేత, న్యాయవాది అజయ్‌ అగర్వాల్‌ తాజా పిటిషన్‌లో ఆరోపించారు. బోఫోర్స్‌ కేసుతో ఎలాంటి సంబంధం లేని కపిల్‌ సిబల్‌ను జనవరి 16న జరిగిన విచారణలో జోక్యం చేసుకోవడానికి సీజేఐ అనుమతించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు.

సిబల్‌ జోక్యాన్ని తాను వ్యతిరేకించినా సీజేఐ పట్టించుకోలేదని ఆరోపించారు. అంతేకాకుండా బోఫోర్స్‌ కేసులో ఫిర్యాదుదారైన తనకు తగిన సాక్ష్యాలు తెచ్చే అర్హత, సామర్థ్యం లేవన్న సిబల్‌ వాదనతో సీజేఐ ఏకీభవించా రన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీచేసిన అజయ్‌.. అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో ఓటమి పాలయ్యారు. 

మరిన్ని వార్తలు