ధీరవనితలు

20 Sep, 2018 01:24 IST|Sakshi
ఆఫ్రీన్‌ రెహ్మాన్‌, అతియా సాబ్రీ,, ఇష్రత్‌ జహాన్‌, షయారా బానో

న్యూఢిల్లీ: ‘ట్రిపుల్‌ తలాక్‌’ రూపంలో తాము ఎదుర్కొంటున్న కష్టాలు, వివక్షకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన వారంతా ముస్లిం మహిళలే. ఈ అంశానికే సంబంధించిన మొత్తం ఏడు పిటిషన్లను ఒకచోట చేర్చి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. షయారా బానో (36)తోపాటు నలుగురు మహిళలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లు, ఆరెస్సెస్‌ అనుబంధ రాష్ట్రీయవాదీ ముస్లిం మహిళా సంఘం, భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌ వేసిన పిటిషన్లను కలిసి సుప్రీంకోర్టు విచారించింది.

► షయారా బానో
2015 అక్టోబర్‌లో ఒక లేఖ ద్వారా షయారా బానో భర్త రిజ్వాన్‌ అహ్మాద్‌ ట్రిపుల్‌ తలాక్‌ చెప్పడంతో పాటు పిల్లలను తన వెంట తీసుకెళ్లిపోయాడు. దీనిపై బానో బహిరంగంగానే మండిపడింది. 3 నెలల విరామాన్ని (ఇద్దత్‌) పాటించకుండా విడాకులు ఇవ్వడం అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని వాదించింది. అత్తమామలు తనకు బలవంతంగా మాత్రలు ఇవ్వడం వల్ల ఆరుసార్లు గర్భస్రావమై, తన ఆరోగ్యంపై దు ష్ప్రభావం చూపిందని బానో సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఆమె వేసిన పిటీషన్‌పై కేంద్ర ప్రభుత్వం కూడా అఫిడవిట్‌ దాఖలు చేసింది.

► ఇష్రత్‌ జహాన్‌
పశ్చిమ బెంగాల్‌ హౌరాకు చెందిన ఇష్రత్‌ జహాన్‌కు 2015 ఏప్రిల్‌లో భర్త ముర్తజా దుబాయ్‌ నుంచి ఫోన్‌లో మూడుసార్లు తలాక్‌  చెప్పి విడాకులిచ్చారు. దీనిని ఆమె తమ పిటిషన్‌లో ప్రశ్నించారు. మరో యువతిని పెళ్లాడిన ముర్తజా.. తన నలుగురు పిల్లలనూ తీసుకెళ్లినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్‌ ద్వారా తలాక్‌ తనకు సమ్మతం కాదని, పిల్లలను తనకు అప్పగించాలని, వారిని పెంచి పెద్ద చేసేందుకు అవసరమైన భరణాన్ని ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు.

► ఆఫ్రీన్‌ రెహ్మాన్‌
2014లో వివాహ సంబంధాల పోర్టల్‌ (మెట్రిమోనియల్‌ సైట్‌) ద్వారా జైపూర్‌కు చెందిన సయ్యద్‌ అషార్‌ అలీ వార్సీతో ఆఫ్రీన్‌ రెహ్మాన్‌ వివాహమైంది. పెళ్లి అయిన రెండు, మూడునెలలకే కట్నం కోసం అత్తమామల వేధింపులు అధికమయ్యాయి. అదనపు కట్నం కూడా వారు తనను శారీరకంగా కూడా హింసించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2015 సెప్టెంబర్‌లో తనను ఇంటి నుంచి వెళ్లగొట్టారన్నారు. 2016 జనవరి 27న పుట్టింట్లో ఉన్న ఆమెకు స్పీడ్‌పోస్ట్‌ ద్వారా విడాకులు అందాయి. ఈ పద్ధతిలో విడాకులు పంపించడం తనకు ఆమోదయోగ్యం కాదంటూ ఆమె పిటిషన్‌ వేశారు.

► ఫరా ఫైజ్‌
ట్రిపుల్‌ తలాక్‌ కేసు పిటిషనర్లలో సుప్రీంకోర్టు న్యాయవాది ఫరా ఫైజ్‌ ఒకరు. ముమ్మారు తలాక్‌ పద్ధతి ఖురాన్‌లో విడాకులను గుర్తించేందుకు ఉద్దేశించినది కాదనేది ఆమె వాదన. ఆరెస్సెస్‌ అనుబంధ రాష్ట్రీయవాదీ ముస్లిం మహిళా సంఘానికి జాతీయ గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. షరియా చట్టం కింద ముస్లిం మహిళలకు భద్రత ఉన్నా ఖురాన్‌లో ప్రస్తావన లేని ట్రిపుల్‌ తలాక్, నిఖా హలాలాలకు పర్సనల్‌లా బోర్డు ప్రాధాన్యతనిస్తోందని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

► అతియా సాబ్రీ
2012లో వివాహమైన అతియా సాబ్రీకి ఒక కాగితంపై ‘తలాక్‌’ అంటూ మూడుసార్లు రాసి ఆమె భర్త విడాకులిచ్చారు. ఇలాంటి విడాకులు న్యాయబద్ధం కాదంటూ ఆమె పిటిషన్‌ వేశారు. తనకు చిన్నవయసున్న ఇద్దరు ఆడ పిల్లలున్నారని, వారిని పెంచి పెద్దచేయాల్సిన బాధ్యత తనపై ఉన్నందున న్యాయం చేయాలని కోర్టుకు విజ్ఞప్తిచేశారు.

► గుల్షన్‌ పర్వీన్‌
2015లో తల్లిదండ్రులను కలిసేందుకు పుట్టింటికి వచ్చిన తనకు పది రూపాయల స్టాంప్‌ పేపర్‌పై విడాకుల పత్రం (తలాక్‌ నామా) పంపించి భర్త విడాకులు ఇవ్వడాన్ని యూపీలోని రాంపూర్‌కు చెందిన గుల్షన్‌ పర్వీన్‌ కోర్టులో సవాల్‌ చేశారు. ఈ విడాకులకు అంగీకరించకపోవడంతోపాటు భర్త నోటీసునూ ఆమె తిరస్కరించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా