సుప్రీంకోర్టును మోసం చేసిన కేంద్రం

10 May, 2019 04:34 IST|Sakshi

రఫేల్‌ కొనుగోలు కేసులో తప్పుదోవ పట్టించింది

ధర్మాసనానికి తెలిపిన పిటిషనర్లు

నేడు ‘రఫేల్‌’పై సమీక్ష విచారణ

న్యూఢిల్లీ: రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టును కేంద్రం మోసం చేసిందని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరీ, సీనియర్‌ లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ ఆరోపించారు. కేంద్రానికి అనుకూలంగా తీర్పు వచ్చేందుకు సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందని పేర్కొన్నారు. రఫేల్‌ కేసులో డిసెంబర్‌ 14న వచ్చిన తీర్పును సమీక్షించాల్సిందిగా వారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రీజాయిండర్‌ అఫిడవిట్‌లో సుప్రీంకోర్టును కోరారు. తప్పుడు ఆధారాలు చూపి, సరైన పత్రాలను, సమాచారాన్ని గోప్యంగా ఉంచడం వల్ల ఆ తీర్పు వచ్చిందని పేర్కొన్నారు.

కేంద్రం ఇప్పటికి కూడా నిజమైన పత్రాలను కోర్టు ముందు ఉంచట్లేదని, అందుకే తాము నిజమైన పత్రాలను బహిర్గతపరచాలని డిమాండ్‌ చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. ‘సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకోర్టుకు అందజేసిన వివరాలతో కేంద్రం తప్పుదోవపట్టించిందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆధారాలను కేంద్రం తొక్కిపట్టి కోర్టు నుంచి తప్పుడు తీర్పు పొందింది’ అని ఆరోపించారు. రఫేల్‌ కేసు తీర్పుపై సమీక్ష జరపాలని పిటిషన్‌కు సమాధానంగా కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌కు స్పందనగా ఆ ముగ్గురు రీజాయిండర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. కాగా, రఫేల్‌ తీర్పుపై సమీక్ష జరపాలంటూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ జరుపుతామని సీజేఐ గొగోయ్‌ నేతృత్వంలోని బెంచ్‌ తెలిపింది.

వారి ఆరోపణలు నిరాధారం..
రఫేల్‌ కొనుగోలు కేసులో పిటిషనర్ల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. రక్షణ శాఖ నుంచి లీక్‌ అయిన పత్రాల ఆధారంగా వచ్చిన వార్తాకథనాలపైనే వారు ఆధారపడ్డారని పేర్కొంది. ఇది కచ్చితంగా అధికారులు వారి విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడమే అవుతుందని వెల్లడించింది.  

>
మరిన్ని వార్తలు