పెట్రో ధరలకు మళ్లీ రెక్కలు..!

23 Sep, 2018 09:21 IST|Sakshi

అత్యధికంగా ముంబైలో పెట్రోల్‌ ధర రూ. 89.97

సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెట్రోల్‌ ధరలు మరోసారి పెరిగాయి. దేశంలో అత్యధికంగా అర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్‌ రూ.89.97 కాగా, డీజిల్‌ ధర 78.53గా రికార్డు నమోదైంది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.87.57, డీజిల్‌ 80.40, విజయవాడ పెట్రోల్‌ ధర 86.95 కాగా, డీజిల్‌ రూ 79.51గా నమోదైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. లీటర్‌ పెట్రోల్‌ 82.61, కాగా డీజిల్‌ ధర 73.77గా ఉంది.  భారీ పెట్రోల్‌ ధరలతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులకు గురైవుతున్నారు.

ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతుండటాన్ని నిరసిస్తూ రాహుల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ మోదీ సర్కార్‌ను టార్గెట్‌ చేస్తోంది. పెట్రో భారాలకు నిరసనగా ఆ పార్టీ గతవారంలో దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌ను పాటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఇంధన ధరలకు చెక్‌ పెట్టేందుకు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడమే పరిష్కారమని ఇటీవల పెట్రోలియం సహజవాయు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. ఢిల్లీలో ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతోనే ప్రధాని విధిలేని పరిస్థితుల్లో మెట్రోలో ప్రయాణిస్తున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక యూనిట్‌ ట్వీట్‌ ద్వారా ఎద్దేవా చేసింది.

మరిన్ని వార్తలు