ఏడాది కనిష్టానికి ‘పెట్రోల్‌’

31 Dec, 2018 04:50 IST|Sakshi

లీటర్‌ ఢిల్లీలో రూ.69.04, హైదరాబాద్‌లో రూ.73.22

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌ ధరలు ఆదివారం మరింత తగ్గాయి. పెట్రోల్‌ లీటర్‌కు 22 పైసలు తగ్గడంతో దేశ రాజధానిలో రూ.69.26 నుంచి ఈ ఏడాదిలోనే కనిష్ట స్థాయి రూ.69.04కు చేరుకుంది. డీజిల్‌ ధర కూడా లీటరుపై 23 పైసలు తగ్గడంతో రూ.63.32 నుంచి తొమ్మిది నెలల కనిష్ట స్థాయి రూ.63.09కి దిగి వచ్చిందని ప్రభుత్వరంగ ఆయిల్‌ సంస్థలు తెలిపాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం వచ్చే కొద్ది రోజుల్లో పెట్రో ధరలు మరింతగా తగ్గే అవకాశముందని వెల్లడించాయి.

ఆగస్టు 15వ తేదీన పెట్రోల్‌ ధర ఢిల్లీలో రూ.77.14, ముంబైలో రూ.84.58, డీజిల్‌ లీటర్‌ ఢిల్లీలో రూ.68.72, ముంబైలో రూ.72.96గా ఉండగా 16వ తేదీ నుంచి పైకి ఎగబాకడం ప్రారంభించి, అక్టోబర్‌ 4వ తేదీన రికార్డు స్థాయికి ఢిల్లీలో రూ.91.34, ముంబైలో రూ.84కు చేరుకుంది. అదే రోజు డీజిల్‌ ధర కూడా ఢిల్లీలో లీటర్‌కు రూ.75.45, ముంబైలో రూ.80.10కు చేరుకుంది. ఆ తర్వాత అంతర్జాతీయంగా చమురు ధరలు క్రమంగా తగ్గడంతో ఆ ప్రభావం దేశీయంగా పడింది.

హైదరాబాద్‌లో..: ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.73.22కు చేరింది. అక్టోబరులో రూ.89.06 ధరతో రికార్డు సృష్టించిన పెట్రోల్‌ ధర నవంబర్‌ నాటికి రూ.84.14కు చేరింది. డిసెంబర్‌ మొదటివారంలో రూ.76.89 ఉన్న ధర చివరి వారంలో మరో రూ.3.67 తగ్గడం విశేషం. డీజిల్‌ ధర లీటరుకు ప్రస్తుతం రూ.68.67కు చేరింది. అక్టోబర్‌లో లీటరు డీజిల్‌ ధర రూ.82.33 కాగా, నవంబర్‌ నెలలో 80.20కు చేరింది. 

>
మరిన్ని వార్తలు