రూ.3.02 తగ్గిన పెట్రోల్ ధర

1 Mar, 2016 00:53 IST|Sakshi
రూ.3.02 తగ్గిన పెట్రోల్ ధర

డీజిల్‌పై రూ.1.47 పెంపు
 
 న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు లీటరుకు రూ. 3.02 తగ్గగా.. డీజిల్ రూ. 1.47 పెరిగినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ప్రకటించింది. మారిన ధరలు సోమవారం అర్థరాత్రినుంచి అమల్లోకి వచ్చాయి. ఫిబ్రవరి నెలలో పెట్రోల్ ధరలు తగ్గటం, డీజిల్ ధరలు పెరగటం ఇది రెండోసారి. కాగా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గటం ఇది ఏడోసారి. ఫిబ్రవరిలో పెట్రోల్ ధరలు తగ్గినా అది నామమాత్రంగానే ఉన్నాయి. ఫిబ్రవరి 1న పెట్రోల్ ధర నాలుగు పైసలు, 18న 32 పైసలు తగ్గగా.. డీజిల్ ఫిబ్రవరి 1న మూడు పైసలు తగ్గగా.. ఫిబ్రవరి 18న 28 పైసలు పెరిగింది.

అంతర్జాతీయంగా పెట్రో ఉత్పత్తుధరలు తగ్గటం, డాలర్‌తో రూపాయి మారక విలువ స్వల్పంగా తగ్గటంతో పాటు పదిహేనురోజులకోసారి ఇంధన సరఫరా కంపెనీల సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్లే ధరల్లో మార్పులు తీసుకువచ్చినట్లు ఐఓసీ తెలిపింది. పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ ఒక రూపాయి పెరగగా.. డీజిల్‌పై 1.5 రూపాయలు పెరిగింది. దీని ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి 3200 కోట్ల ఆదాయం సమకూరనుంది. గత నవంబర్ నుంచి పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం పెంచటం ఇది ఐదోసారి కావటం విశేషం. మారిన ధరలతో హైదరాబాద్‌లో రూ. 63.52 ఉన్న పెట్రోల్ ధర రూ. 60.33కు తగ్గగా.. రూ.48.51 ఉన్న డీజిల్ రూ. 50.09కు లభించనుంది.

మరిన్ని వార్తలు