లీటర్‌ పెట్రోల్‌.. రూ. 300?!

16 Nov, 2017 15:15 IST|Sakshi

సౌదీ అరేబియా-ఇరాన్‌ మధ్య ప్రచ్ఛన్నయుద్ధం

ఆయిల్‌ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం

సమస్యను జఠిలం చేసిన లెబనాన్‌

భారత్‌లో భారీగా పెరగనున్న ఇంధన ధరలు

ఇంధన ధరలు చుక్కలను తాకనున్నాయా? పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడికి ఇక అందవా? అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాలు.. భారతీయులకు శాపంగా మారున్నాయా? సమీప రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌ రూ.300 చేరుకున్నా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదా? అంటే అవుననే చెబుతున్నారు విశ్లేషకులు.

మధ్యప్రాచ్యంలో మొదలైన ప్రచ్ఛన్న యుద్దం సమీప రోజుల్లో భారత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపేలా ఉన్నాయి. ఈ పరిణామాలతో దేశంలో ఇంధన ధరలకు రెక్కలు వచ్చేలా కనిపిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో అత్యంత బలమైన ఇరాన్‌, సౌదీ అరేబియాలు.. ముడి చమురు ధరను భారీగా పెంచేలా కనిపిస్తున్నాయి. అంతేకాక ఇరు దేశాల మధ్య దశాబ్దాల కాలంగా కోల్డ్‌వార్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌, సౌదీ అరేబియాలు మధ్యప్రాచ్యంలో ప్రబలమైనశక్తిగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా సైనిక, ఆయుధ పరీక్షలకు ఏ మాత్రం వెరవడం లేదు. మధ్య ప్రాచ్యంలో నెలకొన్న కోల్డ్‌వార్‌ పరిస్థితుల నేపథ్యంలో మన దేశంలో ఎన్నడూ లేనంత రీతిలో ఇంధన ధరలు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగే ఇంధన ధరల వల్ల మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.

ఆయిల్‌ మార్కెట్‌పై ప్రభావం
సౌదీ అరేబియా, ఇరాన్‌లు ముడి చమురును అధికంగా ఎగుమతి చేస్తాయి. అంతేకాక ఆయిల్‌ మార్కెట్‌పై పట్టుకోసం దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంటే.. అది ఆయిల్‌ మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.  విశ్లేషకలు అంచనాల మేరకు ఆయిల్‌ డిమాండ్‌ 500 శాతం పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే మన దగ్గర ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ రూ.70 ఉండగా.. అది కాస్తా 500 శాతం పెరిగి.. రూ. 300కు చేరుకునే అవకాశం ఉంది.

సౌదీ, ఇరాన్‌ మధ్యలో లెబనాన్‌
రియాద్‌, టెహ్రాన్‌ మధ్య చాలాకాలంగా ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తున్నా.. తాజాగా మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు లెబనాన్‌ కారణంగా మారింది. లెబనాన్‌పై ఇరాన్‌ ఆధిపత్యం అధికంగా ఉందంటూ ఆ దేశ ప్రధాని సాద్‌ హారరీ.. సౌదీ అరేబియాలో ప్రకటించి తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాక ఇరాన్‌ వల్ల తనకు ప్రాణహానీ ఉందంటూ ప్రకటించారు. ఆ ప్రకటన తరువాత ఆయన లెబనాన్‌ వెళ్లిన తరువాత.. మళ్లీ కనిపించకుండా పోయారు. దీంతో లెబనాన్‌లో తీవ్ర సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి.

తీవ్ర ఉద్రిక్తతలు
మధ్యప్రాచ్యంలో బలమైన ఆర్థిక దేశాలు రెండూ ఆయిల్‌ మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. పూర్తిస్థాయి యుద్ధం జరగదంటూనే.. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కేవలం నెల రోజుల్లోనే ఏర్పడ్డాయని విశ్లేషకులు అంటున్నారు. మరికొందరు మాత్రం.. దీనిని షియా-సున్నీ వర్గాల పోరాటంగానూ అభివర్ణిస్తున్నారు. ఏది ఎలా చెప్పుకున్నా సౌదీ అరేబియా, ఇరాన్‌లు దశాబ్దాలుగా మధ్య ప్రాచ్యంపై ఆధిపత్యం కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. ఈ పోరాటం మన మీద ఏ స్థాయి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు