కొంతవరకు సానుకూల చర్యే.. కానీ..

7 Jul, 2020 11:18 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌- చైనా సరిహద్దుల్లో దాదాపు రెండు నెలల తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల తర్వాత తొలిసారిగా తూర్పు లద్ధాఖ్‌లో తొలిసారిగా సంయమనం దిశగా సోమవారం పురోగతి కనిపించిన విషయం విదితమే. ఘర్షణ వాతావరణానికి కేంద్ర స్థానమైన గల్వాన్ ‌లోయ నుంచి చైనా బలగాలు కిలోమీటరు మేర వెనక్కు వెళ్లాయి. అంతేగాకుండా పెట్రోలింగ్‌ పాయింట్‌(పీపీ) 14 వద్ద నిర్మించిన తాత్కాలిక శిబిరాలు, ఇతర నిర్మాణాలను తొలగించాయి. ఇందుకు ప్రతిగా భారత్‌ సైతం బలగాలను ఉపసంహరించుకుంది. ఇరుదేశాల కమాండర్‌ స్థాయి ఆర్మీ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల మేరకు చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభమైందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. 

కాగా తాజా పరిణామాలపై ఆర్మీ అధికారులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఓ అధికారి.. గల్వాన్‌ లోయలోని పీపీ 14, పీపీ 15, పీపీ 17లతో పాటు గొగ్రా హాట్‌ స్ప్రింగ్స్‌, ప్యాంగాంగ్‌ సరస్సు నుంచి సోమవారం సాయంత్రానికి చైనా బలగాలు పూర్తి స్థాయిలో వెనక్కి మళ్లాయని పేర్కొన్నారు. అయితే వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని.. ప్యాంగాంగ్‌ త్సో వద్ద పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. గల్వాన్‌, గోగ్రా హాట్‌ స్ప్రింగ్స్‌లో చైనా ఆర్మీ అంతగా బలంగా లేదని.. అయితే ప్యాంగాంగ్‌ త్సో వద్ద పరిస్థితి వారికి అనుకూలంగా ఉందని తెలిపారు. అదే విధంగా చైనా బలగాలు వెనక్కి మళ్లే అవకాశం ఎక్కువగానే ఉందని అభిప్రాయపడ్డారు. 

నీటి మట్టం పెరిగినందుకేనా?
‘ఇది చిన్న చర్యే. చైనా సుమారు 1.5 కిలోమీటర్లు వెనక్కు వెళ్లింది. భారత బలగాలు కొంత వెనక్కు వచ్చాయి. ఇదేం శాశ్వతం కాదు. చైనా బలగాలు మళ్లీ ముందుకు రావచ్చు’ అని మరో అధికారి వ్యాఖ్యానించారు. అక్సాయి చిన్‌ ప్రాంతంలో మంచు కరగడంతో, గల్వాన్‌ నదిలో నీటిమట్టం పెరిగిందని, ఆ కారణంగా చైనా దళాలు వెనక్కు వెళ్లి ఉండవచ్చని మరికొంత మంది ఆర్మీ అధికారులు భావిస్తున్నాయి. ‘పాంగాంగ్‌ సొ నుంచి చైనా ఒక్క అంగుళం కూడా వెనక్కు వెళ్లలేదు. మూడు టెంట్లు తొలగించి, 20 వాహనాలను వెనక్కు పంపించడం బలగాల ఉపసంహరణ అనిపించుకోదు’ అని ఆర్మీ సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే, ఇరుదేశాల బలగాల ఉపసంహరణ కొంతవరకు సానుకూల చర్యేనని నార్తర్న్‌ ఆర్మీ మాజీ కమాండర్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ డీఎస్‌ హూడా వ్యాఖ్యానించారు. 

ఉదయం 8.45కి ఫోన్‌..
సోమవారం నాటి బలగాల ఉపసంహరణకు ఒకరోజు ముందుగానే అంటే ఆదివారం ఉదయం ఎనిమిది గంటల 45 నిమిషాల సమయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నుంచి ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవాణేకు ఫోన్‌కాల్‌ వచ్చినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దుల్లో ఇటీవలి పరిణామాలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో సాయంత్రం చర్చలు జరుపనున్నారన్న విషయం గురించి ఆయనకు తెలియజేసినట్లు పేర్కొన్నాయి. దీంతో డ్రాగన్‌ కదలికలు గమనిస్తూనే.. అందుకు అనుగుణంగా తాము స్పందించినట్లు తెలిపాయి. ఈ క్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రెండు గంటల పాటు ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.

ఈ సందర్భంగా వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, సుస్థిరత నెలకొల్పాల్సిన ఆవశ్యకతపై దోవల్‌.. వాంగ్‌ యీకి వివరించగా.. భారత్, చైనాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 సంవత్సరాలు అవుతున్న విషయాన్ని వాంగ్‌ చర్చల్లో ప్రస్తావించినట్లు తెలిపింది. అయితే జూన్‌ 15 నాటి హింసాత్మక ఘర్షణకు కారణం ఎవరన్న విషయంపై మాత్రం ఇరువురు తమ తమ వాదనలు బలంగానే వినిపించినట్లు తెలుస్తోంది. కాగా దాదాపు 45 ఏళ్ల తర్వాత జూన్‌ 15న తొలిసారిగా గల్వాన్‌ లోయలో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. చైనా ఆర్మీ ఘాతుకానికి 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు