ఇళ్ల ముందు నుంచే క‌నిపిస్తున్న మంచుకొండ‌లు

3 May, 2020 10:18 IST|Sakshi

లక్నో: క‌రోనా వ‌ల్ల ప్ర‌కృతి కాస్త ఊపిరి పీల్చుకున్న‌ట్లైంది. రోడ్ల‌పై బండ్లు తిర‌గ‌క గాలి స్వ‌చ్ఛ‌త మెరుగుప‌డింది. ప‌రిశ్ర‌మలు తెర‌వ‌కపోవ‌డంతో దాని‌ వ్య‌ర్థాలు నీళ్ల‌లో క‌లవ‌క న‌దులు ప‌రిశుభ్రంగా మారాయి. దీంతో ప్ర‌కృతి అందాల‌ను ప్ర‌జ‌లు ఆస్వాదిస్తున్నారు. తాజాగా ప్ర‌జ‌ల‌కు వీనుల‌విందు చేసే దృశ్యం ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఆవిష్కృత‌మైంది. రెండు వంద‌ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్త‌రాఖండ్‌లోని మంచుకొండ‌లు యూపీలోని ష‌హ‌రాన్‌పూర్‌లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఈమేర‌కు భార‌త అట‌వీశాఖ అధికారి ర‌మేశ్ పాండే దీనికి సంబంధించిన‌ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. "అటు లాక్‌డౌన్‌, ఇటు అడ‌పాద‌డ‌పా కురుస్తున్న వ‌ర్షాలు  గాలి నాణ్యత‌ను గ‌ణ‌నీయంగా మెరుగుప‌ర్చాయి. (అరుదైన ‘మంచు చిరుత’ను చూశారా?)

అందుకు వ‌సంత్ న‌గ‌ర్‌లో నివ‌సిస్తున్న‌ ఆదాయ‌ప‌న్ను అధికారి దుశ్యంత్ త‌న ఇంటి నుంచి తీసిన ఈ ఫొటోలే నిద‌ర్శ‌నం" అని చెప్పుకొచ్చారు. మ‌రో అట‌వీ అధికారి ప‌ర్వీన్ క‌శ్వ‌న్ సైతం మంచు కొండ‌ల ఫొటోల‌ను పంచుకున్నాడు. ప‌లువురు సైతం త‌మ చుట్టూ క‌నువిందు చేస్తున్న ప్ర‌కృతి దృశ్యాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. సుమారు 30 ఏళ్ల త‌ర్వాత యూపీలో ఇలా మంచు కొండ‌లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ప్ర‌స్తుతం వీటి ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారాయి. ఇక పంజాబ్‌లోని జ‌లంధ‌ర్‌వాసుల‌కు హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని దౌలాధ‌ర్ మంచు కొండ‌లు ద‌ర్శ‌న‌మిచ్చిన విష‌యం తెలిసిందే. (అంత దగ్గరనుంచి తీస్తే పోతారు)

మరిన్ని వార్తలు