‘పౌరసత్వం’పై అపోహలు.. నిజాలు తెలుసుకోండి..!

15 Dec, 2019 17:47 IST|Sakshi

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఈశాన్య రాష్ట్రాల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాల్ని తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలకు ఎలాంటి విఘాతం కలిగించబోమని మరోమారు స్పష్టం చేసింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం అధీనంలోని పీఐబీ (ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో) పౌరసత్వ చట్టానికి సంబంధించి పలు నిజానిజాలను ట్విటర్‌లో శనివారం వెల్లడించింది. 

ఈశాన్య రాష్ట్రాల ప్రజలు భయపడుతున్నట్టు సీఏఏ వల్ల మనదేశంలోకి నూతన వలసలు ఉండబోవని స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో సీఏఏపై ప్రచారంలో ఉన్న అపోహలు.. చట్టం చెబుతున్న వాస్తవాలను #Mythbusters పేరుతో పేర్కొంది. బంగ్లాదేశ్‌లో 28 శాతంగా ఉన్న హిందూ మైనారిటీల సంఖ్య 8 కి చేరిందని వెల్లడించింది. తీవ్రమైన ఉద్రిక్తతల నడుమ ఇప్పటికే చాలామంది మైనారిటీలు ఆయా దేశాల నుంచి ఇతర ప్రాంతాలకు, దేశాలకు వలస పోయారని పేర్కొంది.  
(చదవండి : ‘అల్లర్లు ఆగకపోతే రాష్ట్రపతి పాలనే’)

ఆయా దేశాల్లో మైనారిటీలపై మతపరమైన హింస తగ్గిందని, దాంతో వలసలు కూడా తగ్గుముఖం పట్టాయని  తెలిపింది. ఇక అస్సాంలో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న లక్షా యాభై వేల మంది బంగ్లా హిందువులకు భారత పౌరసత్వం ఇస్తారనే వార్తల్లో వాస్తవం లేదని చెప్పింది. పౌరసత్వ చట్టానికి సవరణలు చేసినంత మాత్రాన విదేశీయులెవరైనా భారత పౌరసత్వం పొందగలరు అనుకుంటే పొరపాటే అవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. మనదేశ పౌరసత్వం కోరుకునే ప్రతి ఒక్కరి దరఖాస్తును అత్యున్నత అథారిటీ పరిశీలిస్తుందని... నిబంధనలకు లోబడి దరఖాస్తులు ఉన్నప్పుడే భారత పౌరసత్వం లభిస్తుందని తేల్చి చెప్పింది.  కాగా, గత నాలుగు రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.
(చదవండి : ‘పౌరసత్వం’పై కాంగ్రెస్‌ రెచ్చగొడుతోంది: అమిత్‌)


>
మరిన్ని వార్తలు