ప్రధాని ఫొటోతోనూ ఆటలా?

4 Dec, 2015 11:13 IST|Sakshi


న్యూఢిల్లీ: సాక్షాత్తు ప్రధానమంత్రి పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను కూడా తప్పుగా అందిస్తారా? అది కూడా.. ప్రభుత్వరంగ సమాచార సంస్థల నుంచి వచ్చే ఫొటోలు తప్పువి ఉంటాయని ఎవరైనా ఊహించగలరా? కానీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) సరిగ్గా ఇలాగే చేసింది. చెన్నైలో భారీ వర్షాలు, వరదలు రావడంతో అక్కడ పర్యటించిన ప్రధానమంత్రి.. నగరంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్‌లో తిరుగుతూ నగరంలో పరిస్థితి మొత్తాన్ని చూశారు. అయితే, ఈ సందర్భంగా పీఐబీ అధికారికంగా విడుదల చేసిన ఫొటోలు వివాదానికి కారణం అయ్యాయి. సాధారణంగా ఏరియల్ వ్యూలో చూసినప్పుడు కింద అంతా సువిశాలంగా కనిపిస్తుంది తప్ప.. ఇళ్లు, అపార్టుమెంట్లు స్పష్టంగా కనిపించవు.

ప్రధాని అలా చూస్తున్నప్పుడు కిటికీ లోంచి కనపడే సాధారణ దృశ్యం స్థానంలో బాగా క్లోజప్‌లో తీసిన ఒక ఫొటోను ఫొటోషాప్‌లో అతికించి ఆ ఫొటోను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. అయితే.. ఈ విషయాన్ని ట్విట్టర్ యూజర్లు వెంటనే కనిపెట్టేశారు. అసలు ఫొటోకు, ఫొటోషాప్‌లో మార్చిన దానికి తేడా ఆ మాత్రం తెలియదనుకుంటున్నారా అంటూ ఒక్కసారిగా కామెంట్లు, మిగిలిన సరదా ఫొటోలతో విరుచుకుపడ్డారు. దాంతో నాలుక కరుచుకున్న పీఐబీ.. వెంటనే తన తప్పును సరిచేసుకుని, అసలు ఫొటోను మళ్లీ ట్వీట్ చేసింది.

>
మరిన్ని వార్తలు