ఇంట్లో కంటే జైలులోనే సకల సౌకర్యాలు

14 Sep, 2018 20:40 IST|Sakshi
చైన్నైలోని పుజ్హల్‌ కేంద్ర కారాగారంలోని ఖైదీలు

చెన్నై : టీవీలు, బెడ్స్‌, మొబైల్‌ఫోన్లు, రుచికరమైన ఆహారం .. ఇవన్నీ ఇంట్లోనే అనుకుంటున్నారా? జైలులో కూడా అనుభవించవచ్చట. చైన్నైలోని పుజ్హల్‌ కేంద్ర కారాగార ఖైదీలు ఇంట్లో కంటే జైలులోనే ఎక్కువ సౌకర్యాలు అనుభవిస్తున్నారు. పుజ్హల్ కేంద్ర కారాగారానికి సంబంధించి ఫొటోలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. జైలు అథారిటీలు ఓ ఖైదీ వాడుతున్న ఫోన్‌ను సీజ్‌ చేయగా... ఈ ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. జైలులో ఉన్న తోటి ఖైదీలకు ఈ సౌకర్యాలు కల్పించడంతో పాటు, దానికింద పెద్ద మొత్తంలో డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. 

జైలులో ఉన్న ఖైదీలు తమ ఇంట్లో ఉండే మాదిరి, సాధారణ దుస్తులు ధరించడంతో పాటు, రుచికరమైన భోజనం, సౌకర్యవంతమైన బెడ్స్‌, ఎలక్ట్రిక్‌ కుక్కర్లు, యూపీఎస్‌ బ్యాటరీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వాడుతున్నట్లు ఈ ఫోటోల ద్వారా తెలిసింది. సెల్‌ఫోన్లు మినహాయించి ‘ఏ’ క్లాస్‌ కేటగిరీ ఖైదీలకు ఆ సౌకర్యాలన్నీ అందిస్తారని జైలు అధికారులు తెలుపుతున్నారు. అయితే జైలులో సెల్‌ఫోన్‌ వాడకంపై వివాదాస్పదమైంది. జైలులో సెల్‌ఫోన్ల వాడకం పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. ‘అందరికి పడకలు ఎప్పుడో అందించాం. ఒక్కో బ్లాక్‌కు ఓ టీవీ కూడా ఉంది. ఇవేవీ అసాధారణం కాదు. కానీ, సెల్‌ఫోన్లు వాడటమే నిబంధనలకు విరుద్ధం. గత వారం ఏడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. దానికి సంబంధించిన విచారణ జరుగుతోంది. ఇవి లోపలికి ఎలా వచ్చాయో అన్నదానిపై దృష్టి సారించాం. దీనిలో ఏ అధికారి ప్రమేయమైనా ఉందని తేలితే తప్పక చర్య తీసుకుంటాం’ అని ఏడీజీపీ అశుతోష్‌ శుక్లా వెల్లడించారు. పండగ సమయాల్లో ప్రత్యేక ఆహారం తినడానికి అనుమతి ఉందని, ఏ క్లాస్‌ ఖైదీలకు వాటిపై నిషేధం లేదని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు