పాక్‌ పావురాన్ని విడిచి పెట్టిన భారత్‌

30 May, 2020 15:13 IST|Sakshi

జమ్మూకశ్మీర్‌: గత ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లాలో కలకలం రేపిన పావురం కేసు ఒక కొలిక్కి వచ్చింది. అన్నివిధాల పావురాన్ని పరీక్షించిన అనంతరం దానిని ఎలాంటి సీక్రెట్‌ ఆపరేషన్లకి ఉపయోగించలేదని నిర్థారించుకున్న తరువాత పోలీసులు విడిచిపెట్టారు. గత ఆదివారం పాకిస్తాన్‌ నుంచి వచ్చిన  పావురం బోర్డర్‌కు దగ్గరలో ఉన్న  గీత దేవి చద్వాల్‌ అనే మహిళ  ఇంటిపై వాలింది. అయితే ఆ పావురం కాలికి ఒక రింగ్‌ ఉండటం గీత గమనించింది. దీంతో అనుమానం వచ్చిన ఆమె దానిని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌కు అప్పగించింది. వారు పావురం గురించి స్థానిక హిరా నగర్‌  పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. గతంలో ఇలాంటి పావురాల ద్వారానే పాకిస్తాన్‌ సమాచారం చేరవేసిన సందర్భాలు చాలా ఉండటంతో పోలీసులు పావురాన్ని అదుపులోకి తీసుకొని అన్ని విధాల తనిఖీ చేశారు. అయితే ఆ పావురాన్ని ఎలాంటి రహస్య  సమాచారం కోసం పంపలేదని నిర్థారించుకున్న తరువాత దానిని స్థానిక పోలీసులు విడుదల చేశారు. (పాక్ నుంచి పావురం.. కోడ్ ఏంటి?)

దీనికి సంబంధించి అధికారులు మాట్లాడుతూ.. ఇది అంతర్జాతీయ సరిహద్దు కావడంతో పాటు చాలా సున్నితమైన ప్రదేశం. రహస్య సమాచారం చేరవేసుకోవడం అనేది ఈ ప్రాంతంలో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. సహజంగా మేం పక్షలను అనుమానించం. అవి వాటి పని అవి చేసుకొని వెళుతూ ఉంటాయి అని తెలిపారు. దీనిపై పావురం యజమాని పాకిస్తానీ హబిబుల్లా మాట్లాడుతూ అది అమాయకపు పావురం. దానిని వదిలిపెట్టమని భారత్‌ని కోరుతున్నాను అని తెలిపారు. ఇక ఆ పావురం కాలికి ఉన్న ఉగరం పై ఉన్న నంబర్లను ఉగ్రవాదులు వాడే సీక్రెట్‌ కోడ్‌ గా మొదట భావించగా దీనిపై స్ఫందించిన హబిబుల్లా ఉంగరంపై ఉన్న నంబరు తన ఫోన్ నంబర్‌ అని అంతే కానీ దాంట్లో ఎలాంటి సీక్రెట్‌ కోడ్‌ లేదని తెలిపారు. అదేవిధంగా పావురాల రేస్‌లో పాల్గొందని తెలిపారు. బోర్డర్‌కు దగ్గరలోనే నివాసం ఉండటంతో పావురం భారత్‌లోకి వచ్చిందని పేర్కొన్నారు. మొత్తం మీద పావురానికి సంబంధించి పూర్తి విచారణ చేసిన తరువాతే దానిని విడిచి పెట్టామని జమ్మూ కశ్మీర్‌ పోలీసు అధికారులు తెలిపారు. (పాకిస్తాన్కు తలొగ్గిన మాజీ సీఎంలు)

మరిన్ని వార్తలు