రాష్ట్రపతి రక్షణగా మూడు కులాల వారేనా?

26 Dec, 2018 18:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి అంగరక్షకుల (సెక్యూరిటీ సిబ్బంది) నియామక ప్రక్రియ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌ వివాదంగా మారింది. రాష్ట్రపతి సిబ్బంది నియామకం కోసం గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దానిలో రాజ్‌పుత్‌, సిక్కు, జాట్‌ కులాల వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. దీనిపై హర్యానాకు చెందిన గౌరవ్‌ యాదవ్‌ అనే యువకుడు ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)ను దాఖలు చేశారు.

బుధవారం దీనిపై విచారించిన ధర్మాసనం నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్మీ నియామక బోర్డు డైరెక్టర్‌ను ఆదేశించింది. దేశాధ్యక్షుడుకి సంబంధించిన సిబ్బందిని కులాల వారిగా నియమించడం ఏంటని పిటిషన్‌దారుడు వ్యాజ్యంలో పేర్కొన్నారు. అంగరక్షకుడిగా తాను అన్ని విధాలా అర్హుడినని, తాను యాదవ కులానికి చెందిన వాడినని తన దరఖాస్తును తిరస్కరించారని గౌరవ్‌ తెలిపారు. రాష్ట్రపతి అంగరక్షకులుగా కేవలం జాట్‌, సిక్కు, రాజ్‌పుత్‌లనే నియమించడం ఏంటని పిటిషనర్‌ తరుఫు న్యాయవాది రామ్‌ నరేష్‌ యాదవ్‌ ధర్మాసనం ముందు వాదించారు. 


 

మరిన్ని వార్తలు