పైలట్ కు కరోనా : విమానం వెనక్కి

30 May, 2020 15:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు మరోసారి కరోనా షాక్ తగిలింది. ఎయిరిండియా పైలట్ ఒకరు కరోనా బారిన పడటంతో మధ్యలోనే వెనుదిరగాల్సి వచ్చింది. మాస్కో నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమాన పైలట్ వైరస్ బారిన పడినట్లు గ్రౌండ్ టీమ్ గ్రహించడంతో విమానం తిరిగి ఢిల్లీకి చేరింది.

ఢిల్లీ నుంచి ఉజ్బెకిస్తాన్ మీదుగా మాస్కోకు బయలు దేరిన ఎయిర్‌బస్ ఎ-320 నియో (వీటీ-ఎక్స్‌ఆర్)విమానం ప్రయాణీకులు లేకుండానే శనివారం మధ్యాహ్నం ఢిల్లీకి తిరిగి వచ్చిందని అధికారులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం సిబ్బందిని క్వారంటైన్ కు తరలించనున్నామన్నారు. అలాగే మరో విమానాన్ని మాస్కో పంపించనున్నామని చెప్పారు. మరోవైపు ఈ ప్రయాణానికి సంబంధించి జరిపిన ముందస్తు  పరీక్షల ఫలితాన్ని తనిఖీ బృందం తప్పుగా (పాజిటివ్ రిపోర్టును నెగిటివ్ గా) చదివినట్టు సమాచారం. రెండోసారి క్రాస్ చెక్ చేస్తుండగా అసలు విషయం బయటపడడంతో అప్రమత్తమయ్యారు.(కరోనా: 92 విమానాలను రద్దుచేసిన ఎయిరిండియా)

కరోనావైరస్‌ను నియంత్రించటానికి తొలుత మార్చి 25న లాక్‌డౌన్ విధించినప్పటి నుంచీ దేశంలో అన్ని రవాణా సదుపాయాలతో పాటు విమాన సర్వీసులను నిలిపివేశారు. అయితే  లాక్‌డౌన్ ఆంక్షల సడలింపులతో రెండు నెలల విరామం తర్వాత దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించింది ఎయిరిండియా. మే 25 నుంచి మూడింట ఒకవంతు మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతి లాంటి ఆంక్షలు, నిబంధనలతో గత వారం పరిమితంగా విమాన సేవలకు ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఢిల్లీ-లుధియానా విమానంలో ప్రయాణించిన ఎయిరిండియా భద్రతా సిబ్బంది ఒకరికి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. (కరోనాపై ఆందోళన అవసరం లేదు: ఢిల్లీ సీఎం)

మరిన్ని వార్తలు