విలేకరులపై విజయన్‌ అసహనం

24 Apr, 2019 17:23 IST|Sakshi

తిరువనంతపురం : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కేరళలో రికార్డు స్థాయిలో పోలింగ్‌ శాతం నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఉదయం సీఎంను కలిసేందుకు విలేకరులు కొచ్చిలోని ప్రభుత్వ గెస్ట్‌హౌజ్‌కు వెళ్లారు. ఆయన బయటికొస్తున్న సమయంలో చుట్టుముట్టి.. గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఈ దఫా పోలింగ్‌ జరగడంపై అభిప్రాయం చెప్పాల్సిందిగా కోరారు. దీంతో అసహనానికి గురైన విజయన్‌.. ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోండి అంటూ బిగ్గరగా అరిచారు. దీంతో కంగుతిన్న విలేకరులు పక్కకి జరిగి ఆయనకు దారి ఇచ్చారు.

కాగా లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా మంగళవారం మూడో విడత పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. 14 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 116 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో కేరళలో ఎన్నడూ లేని విధంగా 77.68 శాతం రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదైంది. రాష్ట్రంలోని 20 లోక్‌సభ స్థానాల్లో విజయం కోసం అధికార ఎల్‌డీఎఫ్‌, ప్రతిపక్ష యూడీఎఫ్‌ తీవ్రంగా కృషి చేశాయి. అంతేగాక కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తొలిసారిగా వయనాడ్‌ నుంచి ఎన్నికల బరిలో దిగారు. అదేవిధంగా శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశంపై ఆందోళనలు చేస్తూ బీజేపీ కూడా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఎక్కువ శాతం పోలింగ్‌ నమోదవడం ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందోనన్న విషయం తెలియాలంటే మే 23 వరకు వేచిచూడాల్సిందే.

>
మరిన్ని వార్తలు