జైపూర్‌కు ‘వారసత్వ’ గుర్తింపు

7 Jul, 2019 04:44 IST|Sakshi

ప్రకటించిన యునెస్కో సమావేశం

న్యూఢిల్లీ: పింక్‌ సిటీగా పేరు పొందిన రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌కు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక మండలి (యునెస్కో) ప్రపంచ వారసత్వ నగరం గుర్తింపు లభించింది. మధ్యయుగపు రాజరిక సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన జైపూర్‌ ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా ప్రపంచ గుర్తింపు పొందింది. జైపూర్‌ను ప్రపంచ వారసత్వ నగరాల్లో చేరుస్తున్నట్లు యునెస్కో శనివారం ట్వీట్టర్‌లో ప్రకటించింది. అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 43వ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యునెస్కో ఇప్పటి వరకు 167 దేశాలకు చెందిన 1,092 ప్రాంతాలను వారసత్వ స్థలాలుగా గుర్తించింది. యునెస్కో వారసత్వ ప్రాంతాలు, కట్టడాలు, సహజ నిర్మాణాల్లో అత్యధికంగా ఇటలీలో 54, చైనాలో 53, భారత్‌లో 37 ఉన్నాయి.

నిర్మాత రెండో జయసింగ్‌
యునెస్కో జైపూర్‌ను వారసత్వ నగరంగా గుర్తించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. క్రీస్తు శకం 1727లో అంబర్‌ మహారాజు రెండో జయ సింగ్‌ ఈ నగరాన్ని నిర్మించాడు. తన రాజధానిని అంబర్‌ నుంచి జైపూర్‌కు మార్చాడు. 16వ శతాబ్దం నాటి అంబర్‌ కోట, గులాబీ రంగు ఇసుక రాతి కట్టడమైన హవామహల్, ఖగోళ విజ్ఞాన కేంద్రం జంతర్‌మంతర్‌ వంటిని  పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తన రాజధాని ఆతిథ్యానికి చిహ్నంగా నిలవాలన్న తలంపుతో జైపూర్‌ మహారాజు రాంసింగ్‌ నగరంలోని కట్టడాలన్నింటికీ గులాబీ రంగు వేయించాడని చెబుతారు. అందుకే దీనిని గులాబీ (పింక్‌)నగరంగా పిలుస్తారు.

గుర్తిస్తే ఏమవుతుంది?
ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆన్‌ మాన్యుమెంట్స్‌ అండ్‌ సైట్స్‌కు చెందిన 21 దేశాల అధికారుల బృందం 2018లో జైపూర్‌ను పరిశీలించింది. ఆ బృందం వారసత్వ స్థలాల జాబితాలో చేర్చవచ్చని సూచించింది. బాకులో జరుగుతున్న సమావేశం ఆ ప్రతిపాదనను పరిశీలించి, జైపూర్‌కు వారసత్వ హోదా ఇవ్వాలని నిర్ణయించింది. దీనిద్వారా మానవ సంస్కృతీ వికాసానికి నిదర్శనంగా నిలిచిన ఈ ప్రాంతం పరిరక్షణ బాధ్యతలను యునెస్కో చేపడుతుంది. మనుషులు, జంతువులు ఈ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించకుండా, స్థానిక పరిపాలనా యంత్రాంగం నిర్లక్ష్యానికి గురి కాకుండా కాపాడుతుంది. ఇందుకు అవసరమైన నిధులను ప్రపంచ వారసత్వ నిధి సమకూరుస్తుంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు