పథకం ఇండియాది.. ఫోటో రష్యాది...

21 Aug, 2017 14:43 IST|Sakshi
పథకం ఇండియాది.. ఫోటో రష్యాది...
న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా ఇప్పుడు ప్రతీ ఒక్కరి జీవితంలో భాగస్వామిగా మారిపోయింది. ఏ విషయాన్నైనా సరే క్షణాల్లో వ్యాపింపజేసేందుకు వేదికలుగా మారుతున్నాయి. ఇక ప్రజలతో నేరుగా కలిసే వీలులేని కొందరు నేతలు, తమ అభివృద్ధిని ప్రచారం చేసుకునేందుకు సంధానకర్తగా వీటిని ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో దొరితే తప్పులు వారి పరువును తీసిపడేస్తున్నాయి. 
 
కేంద్ర సహాయ మంత్రి పీయూష్‌ ఘోయల్‌ తాజాగా చేసిన ఓ ట్వీట్‌ ఆయన్ని ట్రోల్‌ చేసి పడేస్తోంది. జాతీయ వీధి దీపాల మిషన్‌ కార్యక్రమంలో భాగంగా , కేంద్ర ప్రభుత్వం 50,000 కిలోమీటర్ల రహదారి గుండా ఎల్‌ఈడీ లైట్లను అమర్చినట్లు పేర్కొంటూ ఆయన పోస్ట్‌ చేశారు. ఎక్కడో రష్యా దేశానికి చెందిన ఓ ఫోటోను మన దేశానికి చెందిందిగా పేర్కొంటూ ఫోటోను ఆయన ట్వీట్‌ చేశారు. అంతే ముందు వెనకా చూడకుండా ఆయన్ని పలువురు ఏకీపడేశారు. 
 
వెంటనే తన తప్పును గమనించిన పీయూష్‌ తర్వాత ఆ ఫోటోను డిలీట్‌ చేసి మన వీధులకు చెందిన ఫోటోను తిరిగి ట్వీట్‌ చేశారు. అంతేకాదు సోషల్‌ మీడియా వల్ల ఇలాంటి తప్పులు కూడా సవరించుకునే వీలు కలుగుతుందంటూ తన తప్పును సర్దిపుచ్చుకునే యత్నం చేశారు. గతంలో కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో రాజ్‌ కోట్‌ లోని ఓ బస్‌స్టాప్‌ ఫోటోను అప్పుడే ఆవిష్కరించినట్లు తప్పుడు ట్వీట్‌ చేయగా, బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ 2002 గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి ఓ ఫోటోను బెంగాల్‌ అల్లర్లకు చెందిందంటూ షేర్‌ చేసి విమర్శలపాలయ్యాడు.
మరిన్ని వార్తలు