‘మిషన్‌ మోదీ’పై బీజేపీ ఆశలు

17 Apr, 2019 10:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్‌తో బయటపడతామని బీజేపీ భావిస్తోంది. నాయకత్వ సమస్యతో​ కొట్టుమిట్డాడుతున్న కాంగ్రెస్‌ను మోదీ బ్రాండ్‌తో ఢీకొడతామని కాషాయపార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి సరైన నాయకుడు లేడని, బీజేపీకి నరేంద్ర మోదీ వంటి పటిష్ట నేత ఉన్నాడని కేం‍ద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొనడం గమనార్హం. మోదీ నాయకత్వంలో భారత్‌ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందని ఆయన చెప్పారు.

దేశంలోని 130 కోట్ల మంది ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రధాని మోదీ నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. మోదీ సారధ్యంలో దేశం ముందుకు దూసుకువెళుతుంటే విపక్షాలు తమ సర్కార్‌పై బురదచల్లుతున్నాయని విమర్శించారు. రఫేల్‌ ఉదంతంలో తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీని సుప్రం కోర్టు మందలించిందన్నారు. విపక్షాలు మోదీని ఓడించేందుకు కనీస ఉమ్మడి ప్రణాళిక లేకుండానే జట్టు కడుతున్నాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 300కి పైగా స్ధానాలు గెలుపొంది కేంద్రంలో తిరిగి అధికార పగ్గాలు చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు