ఢిల్లీలో ప్లాస్మా చికిత్స విజ‌యవంతం..కానీ..

21 Apr, 2020 11:46 IST|Sakshi

ఢిల్లీ :  క‌రోనావైర‌స్‌ను నివారించ‌డంలో భాగంగా ప్ర‌వేశ‌పెట్టిన ఫ్లాస్మా చికిత్స మంచి ఫ‌లితాన్నిస్తుంది. వారం రోజుల క్రిత‌మే దీనికి సంబంధించిన క్రినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ప్రారంభం కాగా, ఢిల్లీలో తొలి విజ‌యం నమోదైంది. 49 ఏళ్ల క‌రోనా బాధితుడు ఫ్లాస్మా ట్రీట్‌మెంట్ ద్వారా పూర్తిగా కోలుకున్న‌ట్లు  ఢిల్లీ మ్యాక్స్ ఆసుప‌త్రి  వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఏప్రిల్ 4న 49 ఏళ్ల  వ్య‌క్తి క‌రోనా ల‌క్ష‌ణాల‌తో హాస్పిట‌ల్‌లో చేర‌గా, ప‌రీక్షలు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ అని తేలింది. కొద్ది రోజుల్లోనే అత‌ని ఆరోగ్యం క్షీణించి వెంటిలేట‌ర్‌పై చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే డాక్టర్లు అతడికి ప్లాస్మా థెరపీని అందించారు. 

కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మాతో అతడికి చికిత్స చేశారు. ఊహించని రీతిలో ఈ చికిత్స మంచి  ఫలితాన్ని ఇచ్చింది. దీంతో అతడికి అమర్చిన వెంటిలేటర్‌ను  తొలగించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం మెరుగుప‌డి పూర్తిగా కోలుకున్నాడు. రెండుసార్లు నిర్వ‌హించిన కోవిడ్ ప‌రీక్ష‌లోనూ నెగిటివ్ అని తేలింది. అత‌ను పూర్తిగా కోలుకున్న‌ట్లు ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఒక వ్య‌క్తి ఇద్ద‌ర్ని కాపాడ‌వ‌చ్చు : డా. బుధిరాజు
అయితే ఈ ఫ్లాస్మా చికిత్స క‌రోనాను నివారించే మ్యాజిక్ ఫార్ములా కాద‌ని మ్యాక్స్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ బుధిరాజు అన్నారు. "ఫ్లాస్మా థెర‌పీ ద్వారానే అత‌ను కోలుకున్నాడు అని చెప్ప‌లేం. ఎందుకంటే ఇత‌ర ప్రోటోకాల్స్‌ని కూడా మేం ఫాలో అయ్యాం. ఫ్లాస్మా క్రినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌తో మ‌న దేశం ఒక అడుగు ముందుకేసింంద‌ని భావిస్తున్నా.  క‌రోనా సోకిన వ్య‌క్తి నుంచి సేక‌రించిన ఫ్లాస్మాలో యాంటీబాడీస్ అత్య‌ధికంగా ఉంటాయి. దీన్ని ఇత‌ర క‌రోనా రోగుల‌కు అందిచ‌డం ద్వారా ఆ వ్య‌క్తి త్వ‌ర‌గా కోలుకునే అవ‌కాశాలు ఎక్కువ‌" అని పేర్కొన్నారు.  అంతేకాకుండా ఒక దాత 400 ఎంఎల్ ఫ్లాస్మాను దానం చేయ‌గ‌ల‌డ‌ని, దీని ద్వారా ఇద్ద‌రి ప్రాణాల‌ను కాపాడ‌వ‌చ్చు అని డాక్ట‌ర్ బుధిరాజు తెలిపారు.

మరిన్ని వార్తలు