రైల్వే ప్లాట్‌ఫాం టికెట్‌ ధర రూ.50

18 Mar, 2020 02:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

►పశ్చిమ రైల్వే, సెంట్రల్‌ రైల్వే అన్ని పెద్ద స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను రూ. 10 నుంచి రూ. 50కి పెంచాయి. కరోనా వ్యాప్తిని నిరోధించేంరుకు ఆ నిర్ణయం తీసుకున్నాయి.  ప్రయాణికులు లేని కారణంగా మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 1 మధ్య ప్రయాణించాల్సిన 23 రైళ్లను సెంట్రల్‌ రైల్వే రద్దు చేసింది. చెన్నైలోనూ ప్లాట్‌ ఫాం టికెట్‌ ధరను దక్షిణ రైల్వే రూ. 50 చేసింది. 
►అఫ్గానిస్తాన్, ఫిలిప్పైన్స్, మలేసియాల నుంచి మార్చి 31 వరకు భారత్‌కు ఎవరూ రాకూడదని నిషేధం విధించింది. యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు, టర్కీ, బ్రిటన్‌ల నుంచి ప్రయాణికులను భారత్‌ ఇప్పటికే నిషేధించిన విషయం తెలిసిందే. 
►రాష్ట్రంలో ఏ నగరాన్నీ లాక్‌డౌన్‌ చేయాలని అనుకోవడం లేదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే చెప్పారు. అనవసర ప్రయాణాలను రద్దు చేసుకో వాలని, లేదంటే, అన్ని రైలు, బస్సు ప్రయాణాలను నిషేధిస్తామని హెచ్చరించారు. కరోనా ముప్పు నేపథ్యంలో అన్ని పరీక్షలను వాయిదా వేశామన్నారు.  
►కరోనా కట్టడికి రూ. 200 కోట్లతో ఒక అత్యవసర నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు పశ్చిమబెంగాల్‌ సీఎం మమత ప్రకటించారు. మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సినిమా హాల్స్, స్టేడియంలు, ఆడిటోరియంలను, ఏప్రిల్‌ 15 వరకు అన్ని విద్యా సంస్థలను మూసేయాలని ఆదేశించారు. 
►విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ ముందుజాగ్రత్తగా తన ఇంట్లో ఏకాంతవాసంలోకి వెళ్లారు. ఆయన మార్చి 14న కేరళలో ఒక ఆసుపత్రి(ఎస్‌సీటీఐఎంఎస్‌టీ)ని సందర్శించారు. ఇటీవల స్పెయిన్‌ వెళ్లివచ్చిన ఆ ఆసుపత్రి వైద్యుడికి వైరస్‌ సోకినట్లు తాజాగా నిర్ధారణ అయింది. ఆ నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 
►ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయాలు, ఇతర ప్రైవేటు పాఠశాలలు పరీక్షల ఫలితాలు ఆన్‌లైన్‌లోనే ప్రకటించాలని, పేరెంట్‌–టీచర్‌ మీటింగ్స్‌ను జరపకూడదని నిర్ణయించాయి.
►ప్రస్తుతం కరోనా వైరస్‌ను నిర్ధారించేందుకు 72 ఐసీఎంఆర్‌ ల్యాబ్స్‌ అందుబాటులో ఉన్నాయని, త్వరలో ఎన్‌ఏబీఎల్‌ అక్రెడిటేషన్‌ పొందిన ప్రైవేటు ల్యాబ్స్‌ అందుబాటులోకి వస్తాయని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ తెలిపారు.  
►మార్చి 31 వరకు ముఖ్యమైన కేసులను మాత్రమే, అదీ ఆడియో– వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారానే విచారించాలని కేంద్ర సమాచార కమిషన్‌ నిర్ణయించింది. 
►కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మంగళవారం తొలికేసు నమోదైంది. దాంతో ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు, సినిమా హాల్స్‌ మొదలైన వాటిని మూసేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

మరిన్ని వార్తలు