కరోనా: వారు యూకేలో ఉంటే రిస్కు ఎక్కువే!

7 Apr, 2020 17:32 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో యూకేలో చిక్కుకు పోయిన భారతీయ విద్యార్థులను తీసుకొచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీం కోర్టులో రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. భారత్‌లో చిక్కుకుపోయిన యూకే విద్యార్థులను తరలించేందుకు త్వరలో ముంబై, న్యూఢిల్లీ నుంచి విమానాలు బయల్దేరుతాయనే వార్తల నేపథ్యంతో ఈ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. యూకే విద్యార్థులను తీసుకెళ్లేందుకు భారత్‌ సమాయత్తం అవుతున్న క్రమంలో యూకేలోని మనవాళ్లను కూడా స్వదేశానికి రప్పించేందుకు పూనుకోవాలని ఢిల్లీకి చెందిన న్యాయవాదులు మధురిమ మృదుళ్‌, ఆస్థా శర్మ పిటిషన్లలో పేర్కొన్నారు.
(చదవండి: లాక్‌డౌన్‌: మృత్యువాత పడుతున్న మూగజీవాలు)

వారి తరపున అడ్వకేట్‌ సునీల్‌ ఫెర్నాండ్స్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీజేఐ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. యూకే నుంచి విద్యార్థులను తిరిగి తీసుకొచ్చే వరకు వారికి మెరుగైన భోజన, వసతి, వైద్య సదుపాయాలు కల్పించేలా కేంద్రానికి మార్గదర్శకాలు జారీ చేయాలని అన్నారు. ఈమేరకు లండన్‌లో ఉన్న ఇండియన్‌ హైకమిషన్‌ను ఆదేశాలు జారీ చేయాలని కోరారు. యూకేలో కోవిడ్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నందున మన విద్యార్థులకు రిస్కు ఎక్కువగా ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
(చదవండి: లక్షణాలు లేకుండానే కోవిడ్‌-19 దాడి..)

కరోనా భయాల నేపథ్యంలో అన్ని దేశాలు తమ పౌరులను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తుంటే.. భారత్‌ మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని కోర్టుకు విన్నవించారు. వారిని స్వదేశానికి రప్పించి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించి.. నిబంధనల ప్రకారం క్వారంటైన్‌ చేయాలని అన్నారు. పౌరులను దేశంలోకి రాకుండా అడ్డుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనని తెలిపారు. కాగా, సునీల్‌ ఫెర్నాండ్స్‌ వాదనలు ధర్మాసనం.. ఈ విషయంపై కేంద్రం స్పందన తెలియజేయాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను కోరింది. ఏప్రిల్‌ 13కు విచారణ వాయిదా వేసింది. ఇక యూకేలో ఇప్పటివరకు 2300 మరణాలు సంభవించాయి. 

>
మరిన్ని వార్తలు