'మీకు దండం పెడతా.. మమ్మల్ని వదిలేయండి'

3 Aug, 2016 18:39 IST|Sakshi
'మీకు దండం పెడతా.. మమ్మల్ని వదిలేయండి'

నోయిడా: 'ఇంకా మీరు తెలుసుకోవడానికి ఏముంది? చెప్పిందే ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? దయచేసి మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోండి' అంటూ బులంద్ షహర్ లో లైంగిక దాడికి గురైన బాలిక తండ్రి మీడియాను బ్రతిమిలాడుకున్నాడు. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు చిన్నాపెద్ద నుంచి చోటా మోటా నాయకులు.. మీడియా క్యూకట్టి వెళుతుండగా.. ఆ ఊరి బయటే ఓ పెద్ద గ్రూపు చేఇ 'మీకు కావాల్సింది లైంగిక దాడికి గురైన బాలిక ఇళ్లేనా.. ఇదిగో ఇలా కుడిచేతి వైపునకు వెళ్లండి' అంటూ చెప్తున్నారు.

తీరా అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులు బాలిక తండ్రిని పిలవగా అతడు ముఖానికి ఖర్చీఫ్ అడ్డం పెట్టుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా ముసుగు తీయండని బలవంతపెట్టి తీశాక పలు ప్రశ్నలు సందిస్తున్నారు. వారికి చెప్పి వెళుతుండగానే మరో మీడియా ప్రతినిథులు వచ్చి అలాగే చేస్తున్నారు. దీంతో వారి ప్రవర్తన పట్ల విసిగిపోయిన ఆయన..

'నా కూతురు, భార్యకు జరిగిన విషాదం గురించి నేను ఇంకా ఎన్నిసార్లు మీకు చెప్పాలి? ఇంకా ఏం మిగిలి ఉందని మీరు అనుకుంటున్నారు? రాత్రి వరకు నా కూతురు బానే ఉంది. అందరు వచ్చి పదే పదే ప్రశ్నిస్తుండటంతో తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. మరోసారి తను కుప్పకూలింది. ఏమాత్రం ఆపకుండా ఏడుస్తూనే ఉంది. దయచేసి మమ్మల్ని వదిలి వెళ్లిపోండి. మేం ఇక మీ ముందుకు రాము' అంటూ చేతులు జోడించి వేడుకుంటూ ఆ బాలిక తండ్రి కన్నీటీ పర్యంతం అయ్యాడు. మీడియా, రాజకీయ నాయకుల తీరుపట్ల ఈ విషయంలో పలువురు పెదవి విరుస్తున్నారు.

మరిన్ని వార్తలు