సృజనాత్మకతతో అభివృద్ధి జరగాలి

6 Jan, 2018 02:18 IST|Sakshi

115 వెనకబడిన జిల్లాల కలెక్టర్లకు మోదీ పిలుపు

న్యూఢిల్లీ: అభివృద్ధి పరంగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు సృజనాత్మక మార్గాలతో ముందుకు సాగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అంబేడ్కర్‌ జయంతి అయిన ఏప్రిల్‌ 14 నాటికి స్పష్టమైన పురోగతి కనిపించేలా పనిచేయాలని 115 వెనుకబడిన జిల్లాల కలెక్టర్లు, ఇన్‌చార్జి అధికారులకు సూచించారు. శుక్రవారం ‘ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఆఫ్‌ ఆస్పిరేషనల్‌ డిస్ట్రిక్స్‌’ అనే కాన్ఫరెన్స్‌లో మోదీ మాట్లాడారు. అభివృద్ధి లక్ష్యాలు సాధించి శాశ్వత సంతృప్తి పొందే అవకాశం 115 జిల్లాల అధికారులకు ఉందని అన్నారు.

ఆశించిన ఫలితాలు రావాలంటే సంబం ధిత అధికారులు సులువైన లక్ష్యాలపైనే ప్రధానంగా దృష్టిపెట్టాలని, ప్రజల్లో ఆశావహ వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.  ‘ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి జరుపుకుంటున్నాం. వెనకబడిన జిల్లాల్లో సృజనాత్మక మార్గాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పులు తేవడానికి ఈ మూడు నెలలు కష్టపడదాం. నవ భారత నిర్మాణానికి ఈ 115 జిల్లాలే నాంది పలకాలి. ప్రజలు వెనకబడి ఉన్నారంటే వారికి అన్యాయం జరిగినట్లే అవుతుంది’ అని అన్నారు. కార్యక్రమంలో కొందరు అధికారులు పోషణ, విద్య, మౌలిక వసతులు, వ్యవసాయం, జల వనరులు, మావోయిస్టుల సమస్య, నైపుణ్యాభివృద్ధి తదితరాలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు