'ఈ సమావేశాలు దేశాన్ని మలుపు తిప్పుతాయి'

18 Jul, 2016 12:15 IST|Sakshi

న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో 70వ స్వాతంత్ర్య దినోత్సవం రానున్న నేపథ్యంలో భారత పార్లమెంటులో అర్థవంతంగా ముఖ్యమైన అంశాలపై చర్చలు జరుగుతాయని తాను ఆశిస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రతి ఒక్కరు ఈ సమావేశంలో తమ భుజానవేసుకొని సమావేశాలు సజావుగా జరిగేలా చూస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. ఈ వర్షాకాల సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆశిస్తున్నట్లు తెలిపారు.

వర్షాకాల పార్లమెంటు సమావేశాలు సోమవారం ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రుల వివరాలు ప్రధాని మోదీ సభకు పరచియం చేశారు. అనంతరం ఇటీవల మృతిచెందిన నాయకులకు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సంతాపం తెలియజేశారు. అనంతరం సమావేశాలను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు మోదీ మాట్లాడుతూ ఈ వర్షాకాల సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు భారత్ను ఓ కొత్త మార్గంలోకి తీసుకెళ్తాయని చెప్పారు.

ఇందుకు అన్ని పార్టీలు కూడా కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. 70వ భారత స్వాతంత్ర్య దినోత్సవం రానున్న నేపథ్యంలో ఎక్కువ విలువ ఉన్న అంశాలపై చర్చ జరగాలని అన్నారు. జీఎస్టీ బిల్లును ప్రధాని మోదీ ప్రస్తావించారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను గుర్తుచేసుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.

ఇటీవల మరణించిన నేతలకు లోక్ సభ సంతాపం ప్రకటించింది. మరోపక్క, రాజ్యసభ సభ్యుడిగా వెంకయ్యనాయుడు ప్రమాణం చేశారు. హిందీ భాషలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్ నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, నిర్మలాసీతారామన్ కన్నడ భాషలో ప్రమాణం చేశారు. టీజీ వెంకటేశ్ కూడా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు.

మరిన్ని వార్తలు