అవినీతికి విపక్షాల రక్షణ

20 Dec, 2016 03:47 IST|Sakshi
అవినీతికి విపక్షాల రక్షణ

అందుకే పార్లమెంటు సమావేశాల స్తంభన: ప్రధాని మోదీ 

కాన్పూర్‌: అవినీతిపరులను రక్షించడానికే ప్రతిపక్షాలు పార్లమెంటు సమావేశాల్ని స్తంభింపజేశాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. అందుకే నోట్ల రద్దు, నల్లధనం వెలికితీత, ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై చర్చకు వెనుకంజ వేశాయని అన్నారు. వారికి ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ఆసక్తి లేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సోమవారం జరిగిన ‘పరివర్తన్ ర్యాలీ’లో ప్రధాని మోదీ మాట్లాడుతూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. అవినీతి, నల్లధనాన్ని అంతం చేయడమే తమ ఎజెండా అని.. పార్లమెంటును స్తంభింపజేయడమే విపక్షాల ఎజెండా అని ఎద్దేవా చేశారు. ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీలకు ఎన్నికలు, పార్టీలకు విరాళాలు తదితర అంశాలపై చర్చ జరపాలని తాను అఖిలపక్ష సమావేశంలో సూచించానన్నారు. అయితే విపక్షాలు నిరంతరం అరుపులు, నినాదాలతో పార్లమెం టును స్తంభింపజేసి, సభ ప్రతిష్టను దిగజార్చాయని మండిపడ్డారు.

నేతలు రెచ్చగొట్టినా..: ఏటీఎంల వద్ద క్యూల్లో నిలబడిన ప్రజలను రెచ్చగొట్టడానికి కొంతమంది రాజకీయ నాయకులు యత్నించారని.. అయితే సాధారణ ప్రజలు అర్థం చేసుకుని సహకరించారని అన్నారు. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు వ్యవహరిం చారని ప్రశంసించారు. నోట్ల రద్దు అమల్లోకి వచ్చిన నవంబర్‌ 8న తాను ప్రజలను 50 రోజుల గడువు కోరిన విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. తాను మొదట్నుంచీ అదే విషయం చెబుతున్నానని అన్నారు. ఇప్పుడు మరోసారి చెబుతున్నానని 50 రోజుల పాటే కష్టాలుంటాయని.. ఆ తర్వాత అన్ని సమస్యలు క్రమంగా తొలగిపోతాయని మోదీ హామీ ఇచ్చారు. నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న ప్రధాని ఎవరనేది చరిత్ర గుర్తుంచుకోదని, అవినీతిపై ప్రజల పోరాటాన్నే చరిత్ర గుర్తుంచుకుంటుందని అన్నారు.

కాంగ్రెస్‌వన్నీ అబద్ధాలే: రాజీవ్‌ గాంధీ సామాన్య మానవుడికి కంప్యూటర్, మొబైల్‌ ఫోన్ అందించారని కాంగ్రెస్‌ నాయకులు తరచూ చెబుతుంటారని మోదీ అన్నారు. కానీ ఇప్పుడు మొబైల్‌ ఫోన్ ను బ్యాంకు కార్యకలాపాలకు వినియోగించవచ్చని తాను చెబితే.. పేద ప్రజల వద్ద మొబైల్‌ ఫోన్ లేదని అంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అన్నీ అబద్ధాలనే ప్రచారం చేస్తోందని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం నిరోధించడానికి ఎన్నికల సంఘం చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఇక్కడ మోదీ దేశంలోనే తొలి భారత నైపుణ్య సంస్థకు శంకుస్థాపన చేశారు.

మరిన్ని వార్తలు