చౌకీదార్‌ ఉద్యమం ఉధృతం

20 Mar, 2019 02:19 IST|Sakshi

నేడు 25 లక్షల మంది వాచ్‌మన్‌లతో మోదీ ఫోన్‌ సంభాషణ

31న 500 ప్రాంతాల ప్రజలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

న్యూఢిల్లీ/ముంబై: నేనూ కాపలాదారునే (మై భీ చౌకీదార్‌) ప్రచారాన్ని ప్రధాని మోదీ ఉధృతం చేశారు. నేడు దేశవ్యాప్తంగా ఉన్న 25 లక్షల మంది వాచ్‌మన్‌లతో బుధవారం ఫోన్‌ ద్వారా సంభాషించనున్నారు. దీంతోపాటు ఈనెల 31వ తేదీన దేశవ్యాప్తంగా 500 ప్రాంతాలకు చెందిన వివిధ రంగాల ప్రజలతో ముఖాముఖి జరపనున్నారు. పండుగ శుభాకాంక్షలు తెలపడంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో వారి మద్దతు కోరనున్నారు. బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశ వ్యాప్తంగా 500 ప్రాంతాలకు చెందిన బీజేపీ, అనుబంధ సంస్థల నేతలు, వృత్తి నిపుణులు, రైతులు తదితరులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషించనున్నారు.

ఈ సందర్భంగా ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలవాలని కోరడంతోపాటు ‘నేనూ కాపలాదారునే’ అంటూ వారితో ప్రతిజ్ఞ చేయించనున్నారు. ట్విట్టర్‌లో ‘మై భీ చౌకీదార్‌’ హ్యాష్‌ట్యాగ్‌ను 20 లక్షల మంది రీట్వీట్‌ చేయగా 1980 కోట్ల స్పందనలు వచ్చాయి’ అని మంత్రి వివరించారు. ‘కాపలాదారే దొంగ’ అంటూ ప్రధానిని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ చేస్తున్న విమర్శలను ఎదుర్కొనేందుకే ఈ ఉద్యమం చేపట్టారా అన్న ప్రశ్నపై ఆయన స్పందిస్తూ.. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో మోదీ దేశానికి మొదటి సేవకునిగా, కాపలాదారుగా ఉంటానంటూ మాట ఇచ్చారని గుర్తు చేశారు. 

5న ‘పీఎం నరేంద్ర మోదీ’.. 
బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవిత కథ ఇతివృత్తంగా తీస్తున్న సినిమా ‘పీఎం నరేంద్ర మోదీ’ వచ్చే నెల 5న విడుదల చేస్తామని నిర్మాత సందీప్‌ తెలిపారు.  ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మోదీ బాల్యం నుంచి ప్రారంభమై 2014 ఎన్నికల్లో చారిత్రక గెలుపు, దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టడంతో ముగుస్తుంది. 
 

మరిన్ని వార్తలు