మళ్లీ భూతల స్వర్గం చేద్దాం!

9 Aug, 2019 02:56 IST|Sakshi
గురువారం ఢిల్లీలో జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

జమ్మూకశ్మీర్‌పై దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

జమ్మూకశ్మీర్‌ భారత దేశ శిరస్సు, కశ్మీర్‌ అభివృద్ధి మన బాధ్యత

ఆర్టికల్‌ 370 వల్ల ఉగ్రవాదం, వేర్పాటువాదం, అవినీతి ప్రబలాయి

న్యూఢిల్లీ: భూతల స్వర్గమైన కశ్మీర్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చేలా కృషి చేద్దామని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే  ఆర్టికల్‌ 370ని రద్దు చేయడాన్ని చారిత్రక నిర్ణయంగా అభివర్ణించిన ప్రధాని.. ఆ నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులను, 370 రద్దు ఆవసరాన్ని, కశ్మీర్‌ అఖండ భారత్‌లో సంపూర్ణంగా భాగస్వామి కావడం వల్ల ప్రయోజనాలను టీవీలో ప్రసారమైన తన ప్రసంగంలో సుదీర్ఘంగా వివరించారు.

గురువారం రాత్రి 8 గంటల నుంచి దాదాపు 40 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రధాని.. జమ్మూకశ్మీర్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, శాంతియుత, సురక్షిత, సమృద్ధ కశ్మీర్‌ తమ లక్ష్యమని తేల్చిచెప్పారు. స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, కళ, క్రీడ, సాంస్కృతిక రంగాల్లో వారి నైపుణ్యాలకు అంతర్జాతీయ ఖ్యాతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. కశ్మీర్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి చూపుతామని, ఇందుకు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.

ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏ వల్ల రాష్ట్రానికి గానీ, రాష్ట్ర ప్రజలకు గానీ ఎలాంటి ప్రయోజనం కలగలేదని, ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని రాష్ట్రంలో విస్తరించేందుకు పాకిస్తాన్‌కు మాత్రం ఈ నిబంధనలు బాగా ఉపయోగపడ్డాయని ప్రధాని వ్యాఖ్యానించారు. దీనివల్ల గత 3 దశాబ్దాల్లోనే అమాయకులైన 42 వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌లో కొత్త యుగం ప్రారంభమైందని, దీంతో జనసంఘ్‌ వ్యవస్థాపక నేత శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ, దేశ తొలి ఉప ప్రధాని సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్, మాజీ ప్రధాని వాజ్‌పేయి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ల స్వప్నం సాకారమైందని ఉద్ఘాటించారు.

ఆర్టికల్‌ 370పై గతంలో చర్చే జరగలేదని, దాని వల్ల ప్రయోజనాలేంటనే విషయంలో ఎవరికీ స్పష్టత లేకపోయినా.. అది అలా కొనసాగాల్సిందే అని అంతా భావించారని ప్రధాని చెప్పారు. అయితే, తామలా భావించలేదని, జమ్మూకశ్మీర్‌ ప్రజల అభివృద్ధికి అడ్డుగా నిలిచిన ఆ నిబంధనలను తొలగించాలనే ధృడ నిశ్చయంతో ముందడుగు వేశామని వివరించారు. జమ్మూకశ్మీర్‌ భారత దేశ శిరస్సు అని, ఈ ప్రాంతాభివృద్ధి మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370 వల్ల రాష్ట్రంలో వేర్పాటువాదం, ఉగ్రవాదం, అవినీతి, వంశపాలన ప్రబలడం తప్ప రాష్ట్ర ప్రజలకు ఒనగూరిందేమీ లేదన్నారు.

గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న గవర్నర్‌ పాలన వల్ల రాష్ట్రాభివృద్ధి గాడిన పడిందన్న ప్రధాని.. ఇకపై రాష్ట్రాభివృద్ధి, స్థానిక ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతుందన్నారు. జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగించబోమని, కొన్నాళ్ల తరువాత రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. ఈద్‌ శుభాకాంక్షలు తెలుపుతూ.. సోమవారం నాటి ఈద్‌ను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించానన్నారు. కశ్మీరీల ఆశలు, ఆకాంక్షలు, స్వప్నాలను సాకారం చేసేందుకు అంతా కలసిరావాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆ అమరుల కల నిజం చేద్దాం!
‘1965లో పాకిస్తాన్‌ చొరబాటుదారుల గురించి మన బలగాలకు సమాచారం ఇచ్చిన మౌల్వి గులామ్‌ దిన్, కార్గిల్‌ యుద్ధంలో సేవలందించిన లదాఖ్‌కు చెందిన కల్నల్‌ వాంగ్‌చుక్, 2009లో ఉగ్రవాదులతో తలపడిన రాజౌరీ జిల్లాకు చెందిన మహిళ రుక్సానా కౌసర్, గత సంవత్సరం ఉగ్రవాదులు అపహరించి, చంపేసిన రైఫిల్‌మ్యాన్‌ ఔరంగజేబు సహా దేశం కోసం, ఈ ప్రాంతం కోసం అమరులైన ఎందరో సాహస జవాన్లు, పోలీసుల స్వప్నం కశ్మీర్లో శాంతి నెలకొనడమే. వారి స్వప్నాన్ని నిజం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని మోదీ అమరజవాన్లను గుర్తు చేశారు. కౌసర్‌కు కీర్తిచక్ర, వాంగ్‌చుక్‌కు మహావీర్‌ చక్ర పురస్కారాలను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఔరంగజేబు సోదరులిద్దరూ ఆర్మీలో సేవలందస్తున్న విషయాన్ని ప్రధాని గర్వంగా చెప్పారు.

ప్రధాని మోదీ ప్రసంగంలోని ఇతర ముఖ్యాంశాలు..
► దేశాభివృద్ధి, దేశ ప్రజల సంక్షేమం కోసం చర్చోపచర్చల అనంతరం పార్లమెంటు చట్టాలు చేస్తుంది. దేశమంతా అమలయ్యే ఆ చట్టాలు, వాటి ప్రయోజనాలు ఇన్నాళ్లూ కశ్మీర్‌లో అమలు కాకపోయేవి.

► విద్యాహక్కు, బాలికల సంక్షేమానికి సంబంధించిన చట్టాలు, కార్మిక, దళిత, మైనారిటీల కోసం రూపొందించిన చట్టాలు.. ఇవేవీ కశ్మీర్‌లో అమలుకు నోచుకోలేదు. ఇకపై అలా జరగదు. ఇకపై కశ్మీర్‌ సహా దేశవ్యాప్తంగా ఆ చట్టాలు అమలవుతాయి. 1.5 కోట్ల రాష్ట్ర ప్రజలకు ఆ ప్రయోజనాలు అందుతాయి.

► ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఉద్యోగులు, పోలీసులకు లభిస్తున్న సౌకర్యాలు జమ్మూకశ్మీర్‌లోని ఉద్యోగులకూ కూడా లభిస్తాయి. జమ్మూ, కశ్మీర్, లదాఖ్‌ల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలనూ భర్తీ చేస్తాం. ఆర్మీ, పారామిలటరీ దళాల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం.

► ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేస్తాం.

► రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు, విద్యుత్‌ ప్రాజెక్టులు, రోడ్డురవాణా తదితర మౌలిక వసతుల సౌకర్యాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్తాం.

► జమ్మూకశ్మీర్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. ఉత్సాహవంతులైన యువత ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం కావాలి. ఇకపై ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి. వంశ పాలనకు ఇక చరమగీతమే. మీ(స్థానికుల) నుంచే ప్రజా ప్రతినిధులు వస్తారు.

► 1947 తరువాత పాక్‌ నుంచి ఇక్కడికి వలస వచ్చినవారు ఇన్నాళ్లూ ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ఇకపై వారికి ఆ అవకాశం లభిస్తుంది.

► ఐటీ, డిజిటల్‌ టెక్నాలజీలతో ఉపాధికి అవకాశాలుంటాయి.

► రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ అద్భుతంగా ఉంది. పంచాయతీ సభ్యులు, ముఖ్యంగా మహిళలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. వారికి కేంద్రం నుంచి ఇకపై మరింత మద్దతు లభిస్తుంది. నిధులు అందుతాయి.  

► క్రీడల్లో ఆసక్తి, అభినివేశం ఉన్న యువత కోసం శిక్షణ కేంద్రాల ఏర్పాటు, స్పోర్ట్స్‌ అకాడమీల ఏర్పాటు ఉంటుంది. స్థానిక యువత క్రీడానైపుణ్యాలు ఆదరణ పొందాలి.

► చేతి కళలు, వృత్తి నైపుణ్యాల ఆధారంగా స్థానికులకు ఉపాధి అవకాశం లభిస్తుంది. ఇక్కడి కళాకృతులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేలా కృషి చేయాలి.

సినీ పరిశ్రమకు విజ్ఞప్తి
‘సినిమా షూటింగ్‌లకు కశ్మీర్‌ అద్భుతమైన ప్రాంతం. ఇక్కడ షూటింగ్‌లు చేయడమే కాకుండా, స్టూడియోలు, థియేటర్లు నిర్మించాలని బాలీవుడ్, తెలుగు, తమిళ, ఇతర సినీ పరిశ్రమల వారికి విజ్ఞప్తి చేస్తున్నా. తద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తుంది’ అని భారతీయ సినీ పరిశ్రమను మోదీ కోరారు.

ఆర్గానిక్‌ హబ్‌.. లదాఖ్‌
‘లదాఖ్‌కే ప్రత్యేకమైన సేంద్రియ ఉత్పత్తులు, ఔషధ మొక్కలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించాలి. ఇక్కడి జీవ వైవిధ్యత స్థానికులకు ప్రయోజనకరం కావాలి. ఇక్కడి ‘సోలో’ అనే ఔషధ మొక్కను ఆధునిక కాలపు సంజీవని అంటారు. ఆక్సిజన్‌ తక్కువగా లభించే ఇక్కడి ఎత్తైన ప్రాంతాల్లోని సైనికులు, ప్రజలకు ఇది నిజంగా సంజీవనే. ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. వీటితో స్థానికులకు ఆదాయం లభించాలి. ఆ దిశగా ఎగుమతిదారులు, పారిశ్రామికవేత్తలు ఆలోచించాలి’ అని మోదీ ఆకాంక్షించారు.

ప్రసంగాన్ని మెచ్చని కశ్మీరీలు
మోదీ ప్రసంగంపై అనేక మంది కశ్మీరీలు పెదవి విరిచారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేసేందుకు, కశ్మీర్‌ను విడగొట్టేందుకు ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతిని అనుసరించిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి కశ్మీర్‌ భూమి కావాలి తప్ప ఇక్కడి ప్రజల మనసులు కాదని కొందరు ఆరోపించారు. విద్యార్థుల నుంచి వివిధ వృత్తుల్లోని ఉద్యోగుల వరకు.. అనేక మంది మాట్లాడుతూ, ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం వల్ల పర్యావరణం పరంగా చాలా సున్నితమైన కశ్మీర్‌ను మౌలిక వసతుల సంబంధ కార్యకలాపాల కోసం దోపిడీ చేసే అవకాశం ఉందనే భయాన్ని వ్యక్తం చేశారు. ఆజాద్‌ అహ్మద్‌ అనే వైద్యుడు స్పందిస్తూ, ‘కేంద్రానికి మా భూమి కావాలి. మా నమ్మకాన్ని వారు గెలవాలంటే మా అభిప్రాయాలను  తీసుకుని ఉండాల్సింది’ అన్నారు.

మరిన్ని వార్తలు