కౌంట్‌డౌన్‌ : 7న ప్రధాని ప్రసంగంపై ఉత్కంఠ

5 Aug, 2019 12:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తూ హోంమంత్రి అమిత్‌ షా రాజ్యసభలో ప్రకటించిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 7న ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు పూర్వాపరాలను వివరించడంతో పాటు ప్రధాని మరికొన్ని కీలక నిర్ణయాలను తన ప్రసంగంలో వెల్లడిస్తారని భావిస్తున్నారు. ప్రధాని ఎలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

మరోవైపు ఆర్టికల్‌ 370 రద్దును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న క్రమంలో 7న జరిగే అఖిలపక్ష భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం రాజ్యాంగానికి తూట్లు పొడవటమే అని రాజ్యసభలో విపక్ష నేత గులాం​ నబీ ఆజాద్‌ విమర్శించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశారు. పీడీపీ సభ్యులు ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ సభలో తీవ్ర గందరగోళం సృష్టించారు. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని బీఎస్పీ సమర్ధించడం గమనార్హం.

మరిన్ని వార్తలు