టెక్నాలజీతో సమస్యలకు చెక్!

1 Aug, 2016 04:32 IST|Sakshi
టెక్నాలజీతో సమస్యలకు చెక్!

మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ పిలుపు
* పరిశోధనల్లో యువత ఉత్సాహంగా భాగస్వాములవ్వాలి
* సృజనాత్మకతకు సరైన గుర్తింపునిస్తాం..

న్యూఢిల్లీ: దైనందిన సమస్యలకు సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారాలను కనుగొనాలని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  పిలుపునిచ్చారు. ఆదివారం మాసాంతపు ‘మన్ కీ బాత్’లో ఆయన పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, నష్టం, రియో ఒలింపిక్స్, పంద్రాగస్టు వేడుకలు, ఇటీవలి దక్షిణాఫ్రికా పర్యటన వంటి అంశాలపై మాట్లాడారు. ‘భారత్ చాలా సమస్యలను ఎదుర్కొంటోంది. దైనందిన జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి.  వీటికి టెక్నాలజీతో పరిష్కారం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ సమస్యలకు సాంకేతిక పరిష్కారం కోసం యువత పరిశోధనలు చేయాలి’ అని పిలుపునిచ్చారు. సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు, వివిధ పరిశోధనల ద్వారా ఉపాధి కల్పనకోసం ఉద్దేశించిన ‘అటల్ ఇనోవేషన్ మిషన్’ను గుర్తుచేశారు. దైనందిన సమస్యల పరిష్కారానికి రూపొందించే సాంకేతికతకు సరైన గుర్తింపునిస్తామన్నారు. 21వ శతాబ్దిలో నవభారత నిర్మాణానికి ఈ పరిశోధనలు చాలా అవసరమని, ఈ దిశగా విజయం సాధించటమే మాజీ రాష్ట్రపతి  ఏపీజే అబ్దుల్ కలాంకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు.

‘వచ్చే తరం కోసం సృజనశీలురను తయారుచేయాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను ప్రారంభించింది. ఈ ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకున్న పాఠశాలలకు రూ. 10 లక్షలు ఇవ్వటంతో పాటు ఐదేళ్లపాటు దీని నిర్వహణకు సంబంధించిన ఖర్చును కేంద్రమే భరిస్తుంది’ అని  తెలిపారు. సృజనాత్మకతను ప్రోత్సహించే ‘అటల్ ఇంక్యుబేషన్’ కార్యక్రమం కోసం రూ. 10 కోట్ల నిధిని సమకూర్చామన్నారు.
 
వరద బాధితులకు సాయం.. ‘మొన్నటివరకు కరువుతో ఆందోళన చెందాం. ఇప్పుడు పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయి.  కొన్నిచోట్ల వరదలతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. వరదల ప్రభావం ఉన్న రాష్ట్రాలతో కలసి కేంద్రం పనిచేస్తోంది. బాధితులకు సాయం అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’ అని మోదీ అన్నారు.
 
నెలకోరోజు ఉచితంగా పనిచేయరూ!
ప్రసవాల్లో చిన్నారుల మరణాలను తగ్గించాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. పేద గర్భిణుల కోసం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రతినెలా 9వ తేదీన ఉచిత చెకప్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు  తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేయని స్త్రీవైద్య నిపుణులు కూడా ఒకరోజు ఈ కార్యక్రమం కోసం కేటాయించాలని కోరారు.  ఇందుకోసం లక్షల మంది డాక్టర్లు కావాలన్నారు. రియో ఒలింపిక్స్‌లో భారతీయ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

‘గెలుపోటములను పక్కన పెడితే ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక క్రీడల్లో పాల్గొనటమే చాలా గొప్ప విషయం. అందువల్ల మనదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులను అభినందించాలి’ అని అన్నారు.
 
క్విట్ ఇండియా 75 ఏళ్ల సంబరాలు
70వ స్వాతంత్య్ర దినోత్సవంతోపాట ఆగస్టు 8న ‘క్విట్ ఇండియా ఉద్యమ’ 75వ వార్షికోత్సవాలను ప్రజలంతా పండుగలా నిర్వహించాలన్నారు. ఆ చిత్రాలను మోదీ యాప్ ద్వారా తనకు పంపించాలన్నారు. ఎర్రకోట నుంచి ఆగస్టు 15న చేయనున్న ప్రసంగంలో చేర్చాల్సిన అంశాలపై ప్రజల నుంచి సలహాలను మోదీ ఆహ్వానించారు. దక్షిణాఫ్రికా పర్యటనలో గాంధీ జీవితంతో ముడిపడిఉన్న ప్రాంతాల్లో పర్యటించటంతో పలు కార్యక్రమాల్లో పాల్గొనటం ఆనందాన్ని కలిగించిందన్నారు.

ఇటీవలే పార్లమెంటు ఆమోదించిన ‘కాంపా’ చట్టాన్ని ప్రస్తావిస్తూ.. అభివృద్ధి పేరుతో అడవులకు జరుగున్న నష్టాన్ని పూరించేందుకు రూ.40 వేల కోట్లను వివిధ రాష్ట్రాలకు పంచుతున్నట్లు మోదీ తెలిపారు. అటవీకరణను ప్రజా ఉద్యమంలా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాకాలంలో ప్రబలే డెంగ్యూ వంటి వ్యాధుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని మోదీ సూచించారు.  కాగా, మన్ కీ బాత్‌లో కశ్మీర్ పరిస్థితుల గురించి కూడా ప్రధాని మాట్లాడి ఉంటే బాగుండేదని.. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ‘ఇటీవల నెలకొన్న పరిణామాలతో 50 మంది చనిపోయినా.. లెక్కలేనంత మంది గాయపడినా మోదీకి ఇవేం పట్టటంలేదు’ అని ట్విటర్లో విమర్శించారు.
 
వారణాసిలో సోనియా రోడ్ షో
వారణాసి: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అప్పుడే వేడెక్కుతోంది. ప్రధానిమోదీ నియోజకవర్గం వారణాసి నుంచి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. మంగళవారం పట్టణంలో రోడ్ షో నిర్వహించనున్నారు. 8 కి.మీ. సాగే ఈ షోకి వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలివస్తారని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు