అసాధ్యాన్ని సాధ్యం చేశాం

31 Aug, 2019 04:00 IST|Sakshi
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న ప్రధాని మోదీ

భిన్నాభిప్రాయాలుండాలి... వాటిపై చర్చించాలి

నిర్మాణాత్మక విమర్శలను ఎప్పుడూ స్వాగతిస్తా: మోదీ  

న్యూఢిల్లీ/కోచీ: నిర్మాణాత్మక విమర్శలను తానెప్పుడూ స్వాగతిస్తానని, ప్రజా జీవితంలో భిన్నాప్రాయాలకు తావుండాలని, అందరూ తమ తమ భావాలను వ్యక్తం చేసేందుకు అవకాశం ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. భిన్నాభిప్రాయాలు ఉన్నా... సమాజంలో అంశాలపై చర్చ నిరంతరం సాగుతూనే ఉండాలని శుక్రవారం జరిగిన ‘మలయాళ మనోరమ’ సదస్సులో ప్రధాని పేర్కొన్నారు. న్యూఢిల్లీ నుంచి వీడియో లింక్‌ ద్వారా ప్రధాని మాట్లాడుతూ ఈ సదస్సులో పాల్గొంటున్న వారిలో తనలా ఆలోచించే వారు ఎక్కువ మంది లేకపోయినప్పటికీ కొందరి ఆలోచనలను, నిర్మాణాత్మక విమర్ళను తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తుంటానని చెప్పారు.

నవ భారతం అన్న అంశంపై సదస్సు నిర్వహించడాన్ని హర్షిస్తూనే.. ‘‘మీరూ మోదీలా మాట్లాడుతున్నారా?’’ అని విమర్శకులు ప్రశ్నిస్తారని, దానికి సమాధానాలు సిద్ధంగా పెట్టుకోవాలని నిర్వాహకులకు సూచించారు. సిఫారసులు, లైసెన్సులతో... మీ వెనుక ఎవరున్నారన్న అంశాలపై కాకుండా... మీ కలలు, ఆశలను సాకారం చేసుకునేందుకు అవకాశం కల్పించేదే  నవ భారత స్ఫూర్తి అని స్పష్టం చేశారు. ఈ దిశగా తమ ప్రభుత్వం ఒకప్పుడు అసాధ్యం అనుకున్న ఎన్నో మార్పులను చేసి చూపిందని చెప్పారు.

పౌరులే కేంద్రంగా పరిపాలన...
తమ హయాంలో పరిపాలన మొత్తం పౌరులే కేంద్రంగా సాగుతోందని, 1.5 కోట్ల మంది పేదలకు కేవలం నాలుగు గోడలు కాకుండా.. అన్ని రకాల సదుపాయాలు ఉండే ఇళ్లను నిర్మించి ఇవ్వగలిగామని మోదీ తెలిపారు. విదేశాల్లో స్థిరపడిన భారతీయుల యోగక్షేమాలను చూస్తున్నామని అన్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన కేరళ నర్సులు, ఫాదర్‌ టామ్‌ రక్షణకు తాము తీసుకున్న చర్యలను మోదీ ఈ సందర్భంగా వివరించారు. బీజేపీ రాజ్యసభ సభ్యురాలు మీనాక్షీ లేఖి, తిరువనంతపురం కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం నేత మహమ్మద్‌ సలీమ్, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మొహువా మొయిత్రా తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.   

ప్రాచీన వైద్యవిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
న్యూఢిల్లీ: ప్రాచీన వైద్య విజ్ఞానాన్ని ఆధునిక వైద్య విధానాలతో అనుసంధానించే అంశంలో దేశం ఇప్పటివరకూ పెద్దగా పురోగతి సాధించలేదని.. ఈ పరిస్థితి మార్చేందుకు ఆయుష్‌ మంత్రిత్వశాఖ ప్రయత్నాలు మొదలు పెట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో వేల ఏళ్ల నాటి వైద్యవిజ్ఞానం అందుబాటులో ఉందని ఆధునిక పరిశోధనల సాయంతో వాటి ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు ఐదేళ్ల క్రితం ప్రయత్నాలు మొదలుపెట్టామని చెప్పారు. పాత, కొత్త వైద్యవిధానాల మేళవింపుతోనే దేశ ఆరోగ్య రంగం మెరుగుపడగలదని స్పష్టం చేశారు.

హర్యానాలో ఏర్పాటైన పది ఆయుష్‌ కేంద్రాలను శుక్రవారం వీడియో లింక్‌ ద్వారా ప్రారంభించిన ప్రధాని మాట్లాడుతూ ‘‘ఈ మధ్యకాలంలో హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ గొంతునొప్పితో బాధపడుతున్నారు.  ఎన్నికల సమయంలో నాకూ ఇలాంటి సమస్య వచ్చింది. ఇప్పుడైతే ఆయుష్‌ కేంద్రాలు ఏర్పాటయ్యాయి కాబట్టి ఖట్టర్‌ లాంటి వారు అక్కడే చికిత్స తీసుకోవచ్చు’’ అని చమత్కరించారు.  ఆయుష్‌ కార్యక్రమంలోకి తాజాగా  సోవా రిగ్‌పా అనే బౌద్ధ  వైద్యవిధానాన్ని చేరుస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ఆయుర్వేద, సిద్ధ తదితర భారతీయ వైద్యవిధానాలకు విశేష సేవలందించిన 12 మంది వ్యక్తుల పోస్టల్‌ స్టాంపులను ప్రధాని విడుదల చేశారు. గాంధీజీ  వ్యక్తిగత వైద్యుడు దిన్‌షా మెహతా తదితరులు ఉన్నారు.  


ముంబైలోని ‘ది యోగా ఇన్‌స్టిట్యూట్‌’ డైరెక్టర్‌ హస్నా యోగేంద్రకు యోగా అవార్డు ప్రదానం చేస్తున్న మోదీ

మరిన్ని వార్తలు