ఉల్లాసంగా.. ఉత్సాహంగా!

14 Sep, 2017 01:06 IST|Sakshi
ఉల్లాసంగా.. ఉత్సాహంగా!

విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం వరకు ఓపెన్‌టాప్‌ జీప్‌లో
8 కిలోమీటర్లపాటు అడుగడుగునా ఉట్టిపడిన భారత సంస్కృతి
సబర్మతి ఆశ్రమం, సిది సయ్యద్‌ మసీదును సందర్శించిన జపాన్‌ ప్రధాని అబే
నేడు ముంబై–అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలుకు శంకుస్థాపన
ఇండో– జపాన్‌ 12వ వార్షిక సదస్సు


అహ్మదాబాద్‌:  భారత పర్యటనకు వచ్చిన జపాన్‌ ప్రధాని షింజో అబే దంపతులకు అహ్మదాబాద్‌లో బుధవారం ఘనస్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయంలో ఆత్మీయ ఆలింగనంతో అబేకు సాదర స్వాగతం పలికారు. అనంతరం అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం వరకు ఎనిమిది కిలోమీటర్లపాటు ఓపెన్‌ టాప్‌ జీపులో జరిగిన రోడ్‌షోలో మోదీతోపాటుగా అబే దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. అనంతరం వీరు సబర్మతి ఆశ్రమంలో మహాత్మునికి నివాళులర్పించారు.

రెండ్రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్న అబే.. గురువారం అహ్మదాబాద్‌లో భారత తొలి బుల్లెట్‌ రైలు (ముంబై–అహ్మదాబాద్‌) కు శంకుస్థాపనతోపాటుగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. నేడు గాంధీనగర్‌లో జరగనున్న 12వ ఇండో–జపాన్‌ వార్షిక సదస్సులో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలతోపాటుగా.. గుజరాత్‌లో జపాన్‌ పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలూ జరగనున్నాయి. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగినపుడు అబే సూట్‌లో కనిపించారు. కానీ రోడ్‌ షోకు సిద్ధమయ్యేటప్పటికి.. రెండు ఆసియా దేశాల మధ్య సత్సంబంధాలను ప్రతిబింబించేలా మోదీ తరహాలో కుర్తా పైజామా ధరించగా.. అకీ ఎరుపురంగు సల్వార్‌ కమీజ్‌ ధరించి ప్రత్యేకంగా కనిపించారు.

అదిరిపోయిన రోడ్‌షో
అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి అట్టహాసంగా రోడ్‌ షో మొదలైంది. దారిపొడుగునా సంప్రదాయ కళాకారులు నృత్యప్రదర్శనలు నిర్వహించగా.. రోడ్డుకు ఇరువైపులా నిలబడిన జనాలకు మోదీ, అబే అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. భారీ సంఖ్యలో ప్రజలు, కళాకారులు రోడ్డుపొడుగునా భారత్, జపాన్‌ జాతీయ పతాకాలను ఊపుతూ.. అబే దంపతులకు స్వాగతం పలికారు. భారత్‌–జపాన్‌ల మధ్య సత్సంబంధాలకు ఈ రోడ్‌షో ప్రతీకగా నిలిచింది. భారత సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు 28 చోట్ల ఏర్పాటుచేసిన వేదికలపై ప్రదర్శనలిచ్చారు. సంప్రదాయ వేషధారణలో జానపద నృత్యాలతో అలరించారు.

నేడు శంకుస్థాపన, సదస్సు
గురువారం మోదీ, అబే కలసి హైస్పీడ్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం గాంధీనగర్‌లో 12వ ఇండో–జపాన్‌ వార్షిక సదస్సు జరగనుంది. ఈ సదస్సులోనే గుజరాత్‌లో పెట్టుబడులకు సంబంధించి 15 ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి. ఈ ఏడాది చివర్లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్త ప్రాజెక్టులు బీజేపీకి అనుకూలిస్తాయని భావిస్తున్నారు. చైనాతో ఇటీవలి కాలంలో తలెత్తిన సరిహద్దు సమస్యల నేపథ్యంలో.. వార్షిక సదస్సులో భారత్‌–జపాన్‌ మధ్య రక్షణ, భద్రత బంధాలపై మోదీ–అబే ప్రత్యేకంగా చర్చించనున్నారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న యూఎస్‌–2 ఉభయచర యుద్ధవిమానాల కోనుగోలు, సంయుక్తంగా ఆయుధాల తయారీ, వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర అంశాలూ చర్చకు రానున్నాయి. భారత్‌కు జపాన్‌ ఆయుధాలను విక్రయించనుం దన్న వార్తల నేపథ్యంలో ఆ దేశంపై గతేడాది చైనా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మానవరహిత యుద్ధ వాహనాలు, రోబోటిక్స్‌ విషయంలో ఇటీవలే భారత్‌–జపాన్‌ మధ్య వాణిజ్య సాంకేతిక ఒప్పందాలు కూడా కుదిరాయి. అణుశక్తి సహ కారం పైనా ఇరువురు ప్రధానులు చర్చించే అవకాశం ఉంది.

మహాత్మునికి పుష్పాంజలి
సబర్మతి ఆశ్రమంలో మహాత్మునికి మోదీ, అబే దంపతులు పుష్పాంజలి ఘటించారు. ఆశ్రమం ప్రత్యేకతలు, గాంధీ వాడిన చరఖా, అహింసాయుత భారత స్వాతంత్య్ర సంగ్రామంలో చరఖా పాత్రవంటి వివరాలను అబే దంపతులతోపాటు జపాన్‌ నుంచి వచ్చిన అతిథులకు మోదీయే స్వయంగా వివరించారు. గాంధీ నివాసమున్న చిన్న గది ‘హృదయ్‌ కుంజ్‌’లోకి వెళ్లిన అబే దంపతులు అక్కడ గాంధీ వాడిన చరఖాతో ఫొటోలు దిగారు. సబర్మతి ఆశ్రమం సందర్శకుల పుస్తకంలో ‘లవ్‌ అండ్‌ థ్యాంక్స్‌’ అని అబే రాశారు. అకీ కూడా సంతకం చేశారు. అనంతరం మోదీ, అబే, అకీలు ముగ్గురూ సబర్మతి నది తీరంలో కూర్చుని ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అహ్మదాబాద్‌ నగరంలోని 16వ శతాబ్దంనాటి ‘సిది సయ్యద్‌ ని జాలీ’ మసీదును కూడా అబే దంప తులు సందర్శించారు. మసీదు నిర్మాణశైలిని, మసీదు ప్రత్యేకతను మోదీ వీరికి వివరించారు. అత్యంత సంక్లిష్టమైన, అద్భుతమైన ఈ మసీదు నిర్మాణశైలిపై అబే దంపతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అకీ గురువారం అహ్మదాబాద్‌లోని పలు చరిత్రాత్మక ప్రదేశాలతోపాటుగా బ్లైండ్‌ పీపుల్స్‌ అసోసియేషన్‌ (బీపీఏ) అనే ఎన్జీవోను సందర్శిస్తారు.

మరిన్ని వార్తలు