సెప్టెంబర్‌ 25న ఆయుష్మాన్‌ భారత్‌

16 Aug, 2018 02:53 IST|Sakshi
ఎర్రకోటలో మోదీ అభివాదం

2022 నాటికి అంతరిక్షంలోకి భారతీయుడు

సైనిక శాశ్వత నియమాకాల్లో మహిళలకూ అవకాశం

పంద్రాగస్టు ప్రసంగంలో మోదీ

న్యూఢిల్లీ:  దేశ ప్రజలందరికి ఇళ్లు, విద్యుత్, నీరు, వైద్యం, పారిశుద్ధ్యం తదితర వసతులు  అందించే లక్ష్యంతో అవిశ్రాంతంగా పనిచేస్తున్నానని ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అభివృద్ధిలో విదేశాలను అధిగమించగల సానుకూల మార్పు కోసం అత్యంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నానన్నారు. 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రధాని చరిత్రాత్మక ఎర్రకోట వద్ద జెండా వందనం చేసి, అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి మోదీ కాషాయ రంగు తలాపాగా ధరించి రావడం విశేషం. ప్రస్తుత ఎన్డీయే హయాంలో ఇదే ఆయనకు చివరి పంద్రాగస్టు ప్రసంగం కానుంది.

తన ప్రసంగంలో.. తమ నాలుగేళ్ల పాలనలో సాధించిన విజయాలను వివరిస్తూనే.. మరోవైపు, ఎన్నికల ప్రసంగం తరహాలో విపక్షాలపై విమర్శనాస్త్రాలను కూడా మోదీ ఎక్కుపెట్టారు. పండిట్‌ దీన్‌దయాళ్‌ జయంతి సందర్భంగా సెప్టెంబర్‌ 25న ప్రతిష్టాత్మక ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్‌ భారత్‌ను ప్రారంభించనున్నట్లు ప్రధాని వెల్లడించారు. అలాగే, గగనయాన్‌ పథకంలో భాగంగా 2022 నాటికి అంతరిక్షంలోకి భారతీయుడిని పంపిస్తున్నామన్నారు.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించిన విధానాన్ని త్వరలో ఆవిష్కరించనున్నామని తెలిపారు. అత్యాచార కేసుల్లో విధించిన శిక్షలను బాగా ప్రచారం చేయాలని, తద్వారా అలాంటి దుష్ట ఆలోచనలున్నవారిలో భయాందోళనలు కలిగించవచ్చని ప్రధాని సూచించారు. కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి మాజీ ప్రధాని వాజ్‌పేయి చూపిన ‘ఇన్సానియత్, జమ్హూరియత్, కశ్మీరియత్‌’ మార్గాన్ని అనుసరిస్తామని అన్నారు. ఇకపై మహిళలను కూడా త్రివిధ దళాల్లో శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని ప్రకటించారు.

తక్షణ ట్రిపుల్‌ తలాక్‌ను నిషేధించే చట్టం చేసేందుకు కట్టుబడి ఉన్నామని, ప్రతిపక్షాలే దానికి అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. దళితుల ప్రయోజనాల పరిరక్షణకు తీసుకుంటున్న పలు చర్యలను వివరించారు. కార్యక్రమానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధానులు మన్మోహన్‌సింగ్, దేవెగౌడ, త్రివిధ దళాల అధిపతులతో పాటు భారీగా ప్రజలు హాజరయ్యారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే..

అభివృద్ధిపై..
అభివృద్ధిలో మనకన్నా ముందున్న దేశాలను భారత్‌ అధిగమిస్తే చూడాలనే ఆత్రుతతో ఉన్నా. చిన్నారుల్లో పోషకాహార లోపం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వ ట్లేదు. పౌరులకు నాణ్యమైన, సౌఖ్యవంతమైన జీవితం, ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు తహతహలాడుతున్నా. నాలుగో తరం పారిశ్రామిక విప్లవాన్ని భారతే ముందుండి నడపాలని కోరుకుంటున్నా.   

ఆయుష్మాన్‌ భారత్‌పై..
50 కోట్ల మంది భారతీయుల ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి రోజైన సెప్టెం బర్‌ 25న ప్రారంభిస్తాం. వ్యక్తి జబ్బున పడితే అతనొక్కడే కాదు కుటుంబం మొత్తం బాధపడుతుంది. ఈ పథకంతో కొత్త ఆసుపత్రులు వస్తాయి. భారీగా ఉద్యోగ కల్పన జరుగుతుంది.

అత్యాచారాలపై..: దేశం ఇలాంటి నీచ మనస్తత్వాన్ని వదిలించుకోవాలి. సమన్యాయ పాలనే మనందరికీ శిరోధార్యం. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. అత్యాచార బాధితురాలి కన్నా సమాజమే లక్షల రెట్లు ఎక్కువ బాధపడాలి. ఉరిశిక్ష విధించిన రేప్‌ కేసులపై ప్రచారం చేస్తే అత్యాచారం చేయాలనుకునే ఆలోచన రాదు.

రైతుల ఆదాయంపై..: సాగు ఎగుమతుల కొత్త విధానాన్ని త్వరలోనే ప్రకటిస్తాం. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేయాలన్న లక్ష్యసాధన దిశగా ప్రభుత్వం సాగుతోంది. పంటల కనీస మద్దతు ధరను సాగు వ్యయానికి 1.5 రెట్లు పెంచడం కీలక నిర్ణయం. రికార్డుస్థాయిలో ధాన్యం ఉత్పత్తి అవుతోంది. మన ధాన్యాగారాలు నిండిపోయాయి.
► నకిలీ లబ్ధిదారులు, మధ్యవర్తులను తొలగించి, పన్ను చెల్లింపుదార్ల సంఖ్య పెంచడం ద్వారా నాలుగేళ్లలో 90 వేల కోట్లను ఆదాచేశాం.
►  ఈ నాలుగేళ్లలో మేము ఢిల్లీని ఈశాన్య రాష్ట్రాలకు చేరువచేశాం.

ప్రపంచదేశాల దృష్టిలో..
‘‘అంతర్జాతీయ సమాజంలో నేడు భారత్‌ గౌరవ ప్రతిష్టలు పెరిగాయి. ఒకప్పుడు అనుమానంతో చూసిన వారే ఇప్పుడు మనవైపు ఆశతో చూస్తున్నారు. మనదేశంలో జరుగుతున్న ప్రతి చిన్న విషయాన్ని ప్రపంచం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. భారత పాస్‌పోర్ట్‌ విలువ పెరగడం దేశ పౌరుల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపుచేసింది. గతంలో ‘రెడ్‌టేప్‌’ గురించి మాట్లాడిన అంతర్జాతీయ సమాజం ఇప్పుడు ‘రెడ్‌ కార్పెట్‌’ గురించి చర్చిస్తోంది. ఒకప్పుడు బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ట్రిలియన్ల కొద్దీ డాలర్లను ఆకర్షించే స్థాయికెళ్లింది. నిద్రాణ స్థితిలో ఉన్న ఏనుగు లాంటి మన ఆర్థిక వ్యవస్థ మేల్కొని పరుగులు పెడుతోంది. వచ్చే మూడు దశాబ్దాలపాటు ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి భారతే ఇంజిన్‌ కానుంది’’ అని మోదీ అన్నారు.
 మోదీ సుదీర్ఘ ప్రసంగం
72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మరోసారి సుదీర్ఘంగా ప్రసంగించారు. గతేడాది ఆగస్టు 15 సందర్భంగా 57 నిమిషాల పాటు ప్రసంగించగా.. ఈసారి 80 నిమిషాలకుపైగా మాట్లాడారు. 2016లో అయితే మోదీ ఏకంగా 96 నిమిషాల పాటు మాట్లాడారు. దీంతో దేశ చరిత్రలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎక్కువసేపు మాట్లాడిన ప్రధానిగా రికార్డు సృష్టించారు.  2015 వరకూ ఆ రికార్డు నెహ్రూ (1947లో 72 నిమిషాలు) పేరిటే ఉండేది. పదేళ్లు ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ ప్రసంగం ఏనాడూ 50 నిమిషాలకు దాటలేదు.
 
విద్యార్థుల ఉత్సాహం

ఈ వేడుకల సందర్భంగా మోదీతో కరచాలనం చేసేందుకు స్కూలు పిల్లలు ఉత్సాహం చూపారు. ఎర్రకోటలో ప్రసంగం ముగిసిన అనంతరం మోదీ ప్రజలు అభివాదం చేస్తూ బయలుదేరారు. ఇంతలో జాతీయ జెండా రంగులున్న దుస్తులు ధరించి అక్కడికి వచ్చిన చిన్నారులను కలుసుకోవడం కోసం తన రక్షణ వలయం నుంచి బయటికొచ్చారు. చిన్నారుల తో కాసేపు ముచ్చటించారు. బాగా చదువుకోవాలని వారికి సూచించారు. సాక్షాత్తూ ప్రధాని దగ్గరకు రావడంతో చిన్నారులు ఆయనతో కరచాలనం కోసం పోటీపడ్డారు. దీంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.   
 
మోదీ నోట భారతి మాట

ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రముఖ తమి ళ కవి సుబ్రమణ్య భారతి రాసిన మాటల్ని ప్రస్తావించారు. ‘దేశ స్వాతంత్య్రానికి కొన్నేళ్ల ముందు భారతి భారత్‌ భవిష్యత్‌ ఎలా ఉం టుందో ఊహించారు. అన్ని రకాల బంధనాల నుంచి మనిషి విముక్తి పొందడం ఎలాగో భారత్‌ ప్రపంచానికి దారి చూపిస్తుందని ఆయ న చెప్పారు’ అని మోదీ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆధునిక తమిళ సాహిత్యంలో అగ్రగణ్యుడిగా పేరుగాంచిన సుబ్రమణ్య భారతి 1882లో తమిళనాడులోని ఎట్టయాపురంలో జన్మించారు. ఆయన 1921లో కన్నుమూశారు.  

 చెత్త కుప్పగా ఎర్రకోట
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట సాక్షిగా అధికారులు దేశ పరువును తీశారు. వేలాది మంది ప్రముఖులతో పాటు విదేశీ ప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమంలో ప్రజల కోసం అధికారులు డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేయలేదు. దీంతో ఆహార పదార్థాలను తిన్న ప్రజలు వాటిని అక్కడే వదిలేసి వెళ్లడంతో ఎర్రకోట ప్రాంగణమంతా చెత్త కుప్పలా తయారైంది. జాతీయ జెండా రంగుల్లోని దుస్తుల్లో ఇక్కడికొచ్చిన స్కూలు విద్యార్థులకు అరటి పళ్లను, మంచినీటిని అందించారు. కానీ చెత్తను పడేసేందుకు చిన్న అట్టపెట్టలను మాత్రమే అందుబాటులో ఉంచారు. అవి త్వరగా నిండిపోవడంతో మరో మార్గంలేక అరటితొక్కలు, ప్లాస్టిక్‌ బాటిళ్లను అక్కడే పడేశారు.

 కాషాయ రంగు తలపాగా
ఎర్రకోట నుంచి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా మోదీ ఈసారి కాషా య రంగు తలపాగా ధరించారు. ప్రధాని గా బాధ్యతలు స్వీకరించిన 2014లో ఎర్రకోట ప్రసంగం సందర్భంగా మోదీ.. కాషాయం, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న జోధ్‌పురి బందేజ్‌ సఫా తలపాగాను ధరించారు. 2015లో ఎరుపు, ఆకుపచ్చ రంగులున్న తలపాగాను, మరుసటి ఏడాది ఎరుపు–గులాబీ– పసుపు వర్ణాలున్న తలపాగాను ఎంచుకున్నారు. గతేడాది తెలుపు, పసుపుపచ్చ, ఎరుపు రంగులున్న తలపాగాను మోదీ ధరించారు.  


పంద్రాగస్టు వేడుకల్లో విద్యార్థులతో సరదాగా ముచ్చటిస్తున్న మోదీ. 


ఎర్రకోటలో స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన అమిత్‌ షా, రాహుల్‌ గాంధీ, నితిన్‌ గడ్కారీ తదితరులు. 


ఎర్రకోట వద్ద విధులు నిర్వర్తిస్తున్న ‘స్వాట్‌’ మహిళా సిబ్బంది

మరిన్ని వార్తలు