ఏ ప్రాణినీ చంపలేను: మోదీ

10 Aug, 2019 04:00 IST|Sakshi

న్యూఢిల్లీ: డిస్కవరీ చానెల్‌లో సోమవారం ప్రసారమయ్యే ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కనిపించనుండటం తెలిసిందే. ఆ కార్యక్రమానికి సంబంధించిన మరో టీజర్‌ శుక్రవారం విడుదలైంది. ఈ కార్యక్రమం షూటింగ్‌ ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కులో జరిగింది. ఈ కార్యక్రమంలో తరచూ సాహసాలు చేస్తూ కనిపించే ఎడ్వర్డ్‌ మైఖేల్‌ గ్రిల్స్‌ (బేర్‌ గ్రిల్స్‌).. తాజా వీడియో టీజర్‌లో పులి నుంచి కాపాడుకునేందుకు ఓ బల్లెంను మోదీకి ఇస్తారు. దీనికి మోదీ స్పందిస్తూ ‘నేను చిన్నప్పటి నుంచి పెరిగిన జీవన విధానం.. ఓ ప్రాణిని చంపడానికి నన్ను అనుమతించదు. కానీ మీరు బలవంతం చేస్తున్నందువల్ల నేను ఈ బల్లెంను పట్టుకుంటున్నాను’ అని చెప్తారు. ఇంకా మోదీ మాట్లాడుతూ ‘మనం ఈ ప్రదేశాన్ని ప్రమాదకరమైన ప్రాంతమని అనుకోకూడదు.

మనం ప్రకృతికి విరుద్ధంగా వెళితే అంతా ప్రమాదకరంగానే మారుతుంది. మనుషులు కూడా ప్రమాదకారులుగా మారారు. అయితే మనం ప్రకృతికి సహకరిస్తే, ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది’ అని అంటారు. ఇండియాను శుభ్రంగా మార్చడంపై జరుగుతున్న కృషి గురించి గ్రిల్స్‌ అడగ్గా, ‘వేరెవరో బయటి నుంచి వచ్చి నా దేశాన్ని శుభ్రం చేయలేరు. భారతీయులే భారత దేశాన్ని శుభ్రం చేస్తారు. వ్యక్తిగత శుభ్రత భారతీయుల సంస్కృతిలోనే ఉంది. సామాజిక శుభ్రతను కూడా మేం అలవాటు చేసుకోవాల్సి ఉంది. దీనిపై మహాత్మా గాంధీ ఎంతో కృషి చేశారు. ఇప్పుడు మేం దీనిలో మంచి ఫలితాలను సాధిస్తున్నాం. సామాజిక శుభ్రత అంశంలో భారత్‌ త్వరలోనే విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నాను’ అని మోదీ ఈ వీడియోలో చెప్తారు. 

మరిన్ని వార్తలు