మనది చేతల సైన్యం..!

15 Oct, 2016 02:05 IST|Sakshi
మనది చేతల సైన్యం..!

- ప్రధాని మోదీ ప్రశంసలు
- భోపాల్‌లో సాహస స్మారకం ప్రారంభోత్సవం
 
 భోపాల్: భారతీయ సైనిక బలగం తన శక్తి, సామర్థ్యాలు, సాహస ప్రవృత్తిని చేతల్లో చూపుతుందే కానీ.. మాటల్లో కాదని ప్రధాని మోదీ ఆర్మీపై ప్రశంసలు గుప్పించారు. పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై ఆర్మీ విజయవంతంగా నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో శుక్రవారం శౌర్య స్మారక్(సాహస స్మారక స్థూపం)ను ప్రధాని ఆవిష్కరించారు. మాజీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్న  సభలో  ప్రసంగించారు. ‘శాంతి సమయాల్లో మనం ప్రశాంతంగా నిద్రపోవడంపై మన ఆర్మీకి సమస్యేం ఉండదు.

కానీ, మెలకువగా, చేతనలో ఉండాల్సిన సమయంలోనూ మనం నిద్రలో ఉండటాన్ని మాత్రం ఆర్మీ ఎన్నటికీ క్షమించదు. అది వారికి అన్యాయం చేయడమే. దురదృష్టవశాత్తూ అప్రమత్తంగా ఉండాల్సినప్పుడు మనం నిద్రపోతూ ఉన్నాం’ అని ప్రధాని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. మన స్వేచ్ఛాస్వాతంత్య్రాల పరిరక్షణకు అన్నివేళలా అత్యంత అప్రమత్తత అవసరమన్నారు. ‘ఈ మాటలు గతంలో అని ఉంటే విమర్శకులు నా ఈకలు పీకేవారు. మోదీ నిద్రపోవడం తప్ప ఏమీ చేయడం లేదనేవారు’ అన్నారు. భారత జవాన్లు సాహసం, మానవత్వం కలగలిసిన వారని ప్రశంసిస్తూ.. రెండేళ్ల కిందటి  శ్రీనగర్ వరదల్లో ఆర్మీ చేసిన సహాయక చర్యలను గుర్తు చేశారు. తమపై రాళ్ల దాడులు చేసి, గాయపర్చినవారే వీరని తెలిసినా.. పట్టించుకోకుండా సహాయ చర్యల్లో నిమగ్నులయ్యారన్నారు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాల్లో భాగంగా వివిధ దేశాల్లో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో విధులు నిర్వర్తించారని భారతీయ ఆర్మీని పొగిడారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా.. మాజీ సైనికుల కోసం తాము ఓఆర్‌ఓపీని అమలు చేశామన్నారు. ‘ఆర్మీ తరహాలోనే మన రక్షణ మంత్రి కూడా మాటల వ్యక్తి కాదు చేతల వ్యక్తి’ అని పరీకర్‌ను ప్రశంసించారు.

 చప్పట్లతో గౌరవించండి: ‘సైనికులు ఎక్కడ కనిపించినా.. చప్పట్లతో వారిని గౌరవించండి’ అని మోదీ పౌరులకు సూచిం చారు. విదేశాల్లో అలాగే చేస్తారన్నారు. అంతకుముందు, మోదీ జైన దిగంబర శాఖ అధిపతి ఆచార్య విద్యాసాగర్‌జీ మహారాజ్‌ను సందర్శించి, ఆశీస్సులు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు