వారికి కచ్చితంగా మరణశిక్ష పడుతుంది!

28 Dec, 2018 19:52 IST|Sakshi

న్యూఢిల్లీ : పిల్లలపై అత్యాచారాలకు పాల్పడే నేరస్తులకు మరణశిక్ష విధించేలా పోక్సో(లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను సంరక్షించే చట్టం) చట్టానికి చేసిన సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీ అనంతరం న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలపై లైంగిక చర్యలకు పాల్పడే నేరగాళ్లకు మరణశిక్ష విధించడమే సరైందని పేర్కొన్నారు. ఈ మేరకు పోక్సో చట్టానికి సవరణలు చేసినట్లు తెలిపారు. పిల్లలను మేజర్లుగా చిత్రీకరించేందుకు హార్మోన్లు ఎక్కించడాన్ని కూడా తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా చైల్డ్‌ పోర్నోగ్రఫీకి పాల్పడే వ్యక్తులకు కూడా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా, ఉన్నావ్‌ ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో సవరణ చేసిన విషయం తెలిసిందే. ఈ సవరణలకు ఆమోదం తెలుపుతూ రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేశారు. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే రేపిస్టులకు గరిష్టంగా మరణశిక్ష విధిస్తారు.

మరిన్ని వార్తలు