ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన మోదీ

19 Aug, 2019 22:03 IST|Sakshi

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ఈ సంభాషణలో కశ్మీర్‌ వ్యవహారంపై మోదీ ట్రంప్‌తో చర్చించారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ పరోక్షంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. అలాగే అమెరికా, భారత్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన జీ 20 దేశాల సదస్సులో ఇరువురు నేతలు భేటీ అయిన సందర్భంగా చర్చించిన అంశాలు కూడా ఈ సందర్భంగా వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి.

కొంత మంది నాయకులు భారత్‌కు వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టేలా చేస్తున్న వ్యాఖ్యలు శాంతికి అనుకూలంగా లేవని మోదీ ట్రంప్‌తో అన్నట్టు సమాచారం. ట్రంప్‌, మోదీల మధ్య సంభాషణ స్నేహపూర్వకంగా సాగిందని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాక్‌ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంప్రదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీ, ట్రంప్‌తో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు