ఒక వ్యక్తికోసం చట్టాన్నే ఉల్లంఘిస్తున్నారు

12 Jul, 2014 02:56 IST|Sakshi
ఒక వ్యక్తికోసం చట్టాన్నే ఉల్లంఘిస్తున్నారు

నృపేంద్ర మిశ్రా నియామకంపై సభలో రభస
ప్రభుత్వంపై టీఎంసీ, కాంగ్రెస్ విమర్శలు
గందరగోళం మధ్యనే సభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం

 
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ప్రిన్సిపల్ కార్యదర్శిగా టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) మాజీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నియామకానికి చట్టబద్ధమైన అడ్డంకులు తొలగించుకునేందుకు ప్రభుత్వం ఒక బిల్లును శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పదవీ విరమణ చేసిన నృపేంద్ర మిశ్రా నియామకం చట్ట బద్ధతను ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలు ఎంత ఆక్షేపణ వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోకుండా బిల్లును ప్రవేశపెట్టింది. నృపేంద్ర మిశ్రా నియామకంపై గత మేనెల 28వ తేదీన ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. రిటైర్డ్ అధికారి అయిన మిశ్రాను ప్రభుత్వ పదవిలో నియమించడం ట్రాయ్‌చట్టం ప్రకారం సాధ్యంకాదు కాబట్టి, ఆయన  నియామకానికి చట్టబద్ధతకోసం ఆర్డినెన్స్ స్థానంలో ట్రాయ్ సవరణ బిల్లును ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ బిల్లు నియమ నిబంధనలను ఉల్లంఘించేదిగా, ట్రాయ్ చట్టం స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసేదిగా ఉందని సభలో తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఆక్షేపించటం తో గందరగోళం చెలరేగింది. ప్రభుత్వ చర్య చట్టవ్యతిరేకమంటా కాంగ్రెస్ పార్లమెంటు వెలుపల వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తికోసం చేస్తున్న అపవిత్ర చర్య అని ధ్వజమెత్తింది.
 అయినా తన చర్యను ప్రభుత్వం గట్టిగా సమర్థించుకుంది. బిల్లును తీసుకువచ్చే పూర్తిస్థాయి అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయని, కాంపిటీషన్ కమిషన్ వంటి సంస్థలతో సమానంగా ట్రాయ్‌కి ప్రతిపత్తి కలిగించడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. 1967వ సంవత్సరం బ్యాచ్‌కి చెందిన ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన నృపేంద్ర మిశ్రాను మే 28న ఆర్డినెన్సు ద్వారా ప్రిన్సిపల్ కార్యదర్శిగా ప్రధాని కార్యాలయంలో నియమించారు.

రైల్వే బడ్జెట్ లీక్‌పై రగడ

రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే బడ్జెట్ ప్రతులు మీడియాకు లీక్ కావడంపై రాజ్యసభలో దుమారం రేగింది. రైల్వే బడ్జెట్ లీకేజీ  చాలా తీవ్రమైన అంశమని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సమాధానమిస్తూ.. అధికారిక రహస్యాలు లీక్ అయిన పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయో పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.

లోక్‌సభలో మంత్రుల గైర్హాజరుపై సర్కార్ ఇరకాటం

లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో రైల్వే మంత్రి సదానంద గౌడ, డిప్యూటీమంత్రి మనోజ్ షా సభలో లేకపోవడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. మంత్రులు అందుబాటులో లేకపోవడాన్ని కాంగ్రెస్ సభలో తీవ్రంగా ఆక్షేపించింది. చర్చ విషయంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రం జన్ చౌదరి వ్యాఖ్యానించారు. భోజన విరామం తర్వాత పది నిమిషాలకు రైల్వే మంత్రి సదానంద గౌడ, మరో మంత్రి మనోజ్ షా సభకు వచ్చి సభకు క్షమాపణ చెప్పారు.
 

మరిన్ని వార్తలు