హ్యాపీ బర్త్‌డే మోదీజీ

18 Sep, 2018 02:23 IST|Sakshi
వారణాసిలో చిన్నారులతో మోదీ

ప్రధానికి శుభాకాంక్షల వెల్లువ

68వ పుట్టినరోజున విద్యార్థులతో గడిపిన ప్రధాని

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 68వ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఆయనకు ప్రముఖ నేతలు, రాజకీయ ప్రత్యర్థులతో పాటు అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులకు ట్విటర్‌లో ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక తన పుట్టిన రోజు వేడుకల్ని మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులు ఉన్నారు.  ‘ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుస్సుతో, మరెంతో కాలం దేశ ప్రజల సేవకు ఆయన అంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను’ అని కోవింద్‌ ట్వీట్‌ చేశారు. మాల్టా పర్యటనలో ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రధానికి ఫోన్‌ చేసి మాట్లాడారు. మోదీకి ఆయురారోగ్యాలు కలగాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తన సందేశంలో రాహుల్‌ పేర్కొన్నారు.   
కొద్దిసేపు టీచర్‌ అవతారమెత్తిన మోదీ  
68వ పుట్టినరోజు వేడుకల్ని తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ జరుపుకున్నారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ్‌ ఆలయాన్ని సందర్శించిన మోదీ దాదాపు 30 నిమిషాల పాటు పూజలు నిర్వహించారు.   డెరెకా ప్రాంతంలో ఉన్న ప్రాథమిక పాఠశాల స్కూలు పిల్లలతో ముచ్చటించారు. టీచర్‌ అవతారమెత్తి వాళ్లకు పలు అంశాల్ని బోధించారు. ప్రశ్నించేందుకు విద్యార్థులు ఎన్నడూ భయపడవద్దని.. నేర్చుకోవడంలో అదే కీలకమని వారికి చెప్పారు. ‘విశ్వకర్మ జయంతి రోజున నేను మీ పాఠశాలకు వచ్చాను. ఈ ప్రత్యేకమైన రోజున మీ అందరికీ శుభాకాంక్షలు’ అని ప్రధాని పేర్కొన్నారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీలో 568 కిలోల లడ్డూను కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జవదేకర్, ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీలు ఢిల్లీలో ఆవిష్కరించారు.


షికాగోలో 13,000 ఎత్తులో విమానం నుంచి దూకి మోదీకి శుభాకాంక్షలు చెబుతున్న స్కైడైవర్‌ శీతల్‌ మహాజన్‌
 

మరిన్ని వార్తలు