సైనికులతో ప్రధాని దీపావళి సంబరాలు

19 Oct, 2017 16:45 IST|Sakshi

మిఠాయిలు స్వయంగా తినిపించిన నరేంద్ర మోదీ

సైనికులే తన కుటుంబమన్న ప్రధాని

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని గురెజ్‌ సెక్టార్‌లోని సైనికులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సైనికులకు ఆయన స్వీట్లు పంచిపెట్టారు. ప్రధానితోపాటు ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌, నార్తర్న్‌ కమాండర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జేఎస్‌ సంధూ.. సైనికులతో దీపావళి జరుపుకున్నారు. ‘నేను దీపావళి పండుగను నా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలనుకున్నాను.. అందుకే మీ దగ్గరకు వచ్చాను.. మీరే నా కుటుంబమ’ని మోదీ సైనికులతో చెప్పారు. సైనికులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపి.. వారికే ఆయనే స్వయంగా స్వీట్లు తినిపించారు. మోదీ సుమారు రెండు గంటల పాటు సైనికులతో గడిపారు.

పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌కు కూతవేటు దూరంలో గురెజ్‌ సెక్టార్‌ ఉంది. దాదాపు 27 ఏళ్ల నుంచి ఉగ్రవాదులు ఇక్కడ చొరబాటుకు ప్రయత్నిస్తున్నారు. అత్యంత ప్రతికూల పరిస్థితులున్న ఈ ప్రాంతంలో సైనికులు తమ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి సహనంతో ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారని ప్రధాని కొనియాడారు.

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఒకే ర్యాంక్‌ ఒకే ఫింఛన్‌ పథకాన్ని సైనికుల సంక్షేమం కోసం అమలు చేసినట్లు ఆయన చెప్పారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులు.. ఉదయాన్నే యోగా చేయడం ద్వారా అంతర్గత శక్తిసామర్థ్యాలను పెంచుకోవచ్చని సూచించారు. అంతేకాక ఆర్మీ నుంచి రిటైర్‌ అ‍య్యాక యోగా శిక్షకులుగా మారవచ‍్చని తెలిపారు. వరుసగా నాలుగో ఏడాది ప్రధాని సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకొన్నారు. 2014లో సియాచిన్‌, 2015లో అమృత్‌సర్‌.. 2016లో ఉత్తరాఖండ్‌లోని ఐటీబీపీ జవాన్లతో కలిసి మోదీ దీపావళి వేడుకలు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు