నోట్ల రద్దు పేదల కోసమే

8 Jan, 2017 02:28 IST|Sakshi
నోట్ల రద్దు పేదల కోసమే

సాక్షి, న్యూఢిల్లీ: పేదల బతుకుల్లో వెలుగులు నింపేందుకే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. నల్లధనం, అవినీతిపై పోరాటానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మున్ముందు పేదల, సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. శనివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ ముగింపు సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ‘నేను అధికారం కోసం పాకులాడను. స్వర్గం వద్దు.. మరో జన్మ వద్దు. పేదల సేవయే.. దేవుడి సేవ. పేదల జీవితాల్లో కష్టాలు తొలగిస్తే చాలు.’అంటూ ఓ సంస్కృత శ్లోకాన్ని ఉటంకించారు.

పేదలను, పేదరికాన్ని ఓట్లు పొందేందుకు దగ్గరి దారిగా బీజేపీ ఏనాడూ చూడదన్నారు. ‘దేశంలోని పేద ప్రజలు.. చరిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతించారు. అవినీతి సహా పలు సామాజిక సమస్యలకు ఇదే మంచి మందు అని అంగీకరించారు. ఈ నిర్ణయంతో తమకు వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదురైనా మార్పుకోసం అన్నీ భరించి స్వాగతించారు’’అని మోదీ వ్యాఖ్యానించారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ ప్రసంగం వివరాలను కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మీడియాకు వెల్లడించారు.

ఆ ఆదివాసీ మహిళ నన్ను ఆశీర్వదించింది
రెండున్నరేళ్లుగా ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలు మద్దతిచ్చారని మోదీ పేర్కొన్నారు. స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ.. ఛత్తీస్‌గఢ్‌లో 90 ఏళ్ల ఆదివాసీ మహిళ తన గొర్రెలమ్మి మరుగుదొడ్డి నిర్మించుకుందని, ఈ ఘటన తనను ఎంతగానో ప్రభావితం చేసిందన్నారు. ఆ ఆదివాసీ మహిళ ఆశీస్సులను కోరినప్పుడు మంచి పనులు చేస్తున్నావంటూ ఆశీర్వదించిందని మోదీ గుర్తుచేసుకున్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలోని పేదలు, అణగారిన వర్గాలకోసం అమలవుతున్న వివిధ పథకాలను, కార్యక్రమాలను పార్టీ కార్యకర్తలు తెలియ చెప్పాలని పిలుపునిచ్చారు.  అంతకు ముందు జైట్లీ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని పార్టీ జాతీయ కార్యవర్గం ఆమోదించింది. నోట్లరద్దుతో నల్లధనం చాలా వరకు బ్యాంకులకు చేరిందని.. దీని వల్ల కేంద్ర, రాష్ట్రాలకు ఆదాయం పెరిగి జీడీపీ వృద్ధి చెందుతుందని తీర్మానంలో పేర్కొన్నారు. బ్యాంకుల వద్దకు పెద్దమొత్తంలో నగదు చేరటంతో.. తక్కువ వడ్డీకే రుణాలు అందుతాయని,  జైట్లీ తెలిపారు.

ఎన్నికల సంస్కరణలకు సిద్ధం
‘‘ఐదు రాష్ట్రాల్లో పరిస్థితి మనకు అనుకూలంగానే ఉంది. కార్యకర్తలు బూత్‌ స్థాయిలో పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. పేదల కోసం పేదల ప్రభుత్వం పనిచేస్తుందనేదే మనం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి’’అని మోదీ తెలిపారు. దేశంలో ఎన్నికల సంస్కరణలు రావటానికి, పార్టీల విరాళాలపై పారదర్శకంగా ఉండేందుకు ఏకాభిప్రాయం రావాలని.. అందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. నోట్ల రద్దు, డిజిటల్‌ లావాదేవీలతో పారదర్శక లావాదేవీలు జరుగుతాయన్నారు. రాజకీయ పార్టీలకు నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయో ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉందన్నారు. నోట్ల రద్దుతో అసహనంలో ఉన్న విపక్షాలు బీజేపీపై అవినీతి ఆరోపణలు చేస్తున్నాయని.. వీటిని పార్టీ నాయకులు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న సుపరిపాలనపై బీజేపీ గుడ్‌ గవర్నెన్స్‌ సెంటర్‌ ఒక ప్రజెంటేషన్‌ ఇచ్చిందని, దీని ప్రకారం బీజేపీ పాలితరాష్ట్రాల్లో సుపరిపాలన బాగుందని రవి శంకర్‌ ప్రసాద్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు