ప్రశాంతంగా ఆలోచించండి: మోదీ

25 Dec, 2019 17:33 IST|Sakshi

లక్నో: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. తాము చేస్తున్నది తప్పో.. ఒప్పో నిరసనకారులు పరిశీలించుకోవాలని విఙ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అటల్‌ బిహారీ వాజ్‌పేయి మెడికల్‌ యూనివర్సిటీ నిర్మాణానికి ప్రధాని మోదీ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘  మీ పిల్లలకు సంబంధించిన బస్సులను, ప్రజా ఆస్తులను మీరు ధ్వంసం చేశారు. యూపీలో హింసను ప్రేరేపిస్తున్న వారిని నేను ఒక్కటే అడుగుతున్నా. ఇంటికి వెళ్లండి. ప్రశాంతంగా కూర్చుని.. మీరు చేస్తున్నది మంచో చెడో మీరే ఆలోచించుకోండి’  నిరసనకారులకు సూచించారు. (చదవండి : పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?)

అదే విధంగా... ప్రశాంత వాతావరణంలో బతకడం ప్రతీ పౌరుడి హక్కు అని.. అయితే ఆ క్రమంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. కాగా సీఏఏకు వ్యతిరేకంగా యూపీలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో నిరసన పేరిట హింసకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. ఆందోళనల పేరిట ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో నిరసన కార్యక్రమంలో చెలరేగిన హింస సందర్భంగా ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టానికి రూ .14.86 లక్షలు రికవరీ కోసం దాదాపు 28 మందికి నోటీసులు అందాయి. అంతేకాదు దెబ్బతిన్న పోలీసు హెల్మెట్లు, లాఠీలు, పెలెట్స్‌ కోసం కూడా  పరిహారం చెల్లించాలని కూడా యోగి ప్రభుత్వం ఆదేశించింది.  (యోగి ప్రతీకారం : రూ. 15 లక్షలు కట్టండి!  )

>
మరిన్ని వార్తలు