ఆకాశ్‌పై ప్రధాని మోదీ మండిపాటు

2 Jul, 2019 13:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్‌ విజయ్‌వార్గియా ప్రభుత్వ అధికారిని బ్యాటుతో చితకబాదిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతవారం మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో జరిగిన ఈ దాడి ఆయన  ఖండించారు. న్యూఢిల్లీలో మంగళవారం ఉదయం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరయిన మోదీ ఈ దాడిపై స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అతను ఎవరి కొడుకైతే ఏంటి...? అలా ప్రవర్తించడం మాత్రం సబబు కాదు’ అంటూ సీరియస్‌ అయ్యారు. ప్రభుత్వ అధికారిపై పట్టపగలు దాడి చేసి.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆకాశ్‌.. బీజేపీ సీనియర్‌ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌వార్గియా కొడుకు కావడం గమనార్హం. 

క్రమశిక్షణారాహిత్యంతో ప్రవర్తించడం ఎంత తప్పో, దాన్ని ప్రోత్సహించడం కూడా అంతే తప్పని.. అలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని మోదీ స్పష్టం చేశారు. ఈ దాడి నేపథ్యంలో ఆకాశ్‌ విజయ్‌వార్గియాతోపాటు అతనికి అండగా నిలిచిన వారిని సైతం పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. అంతేకాకుండా ఆకాశ్‌ బెయిల్‌పై విడుదలైన సందర్భంగా అతనికి స్వాగతం చెప్పేందుకు వెళ్లిన వారిని, ఈ సందర్భంగా గాలిలో కాల్పులు జరిపిన వారిని కూడా పార్టీకి దూరంగా ఉంచాలని, అలాంటివారిని పార్టీ సహించబోదని పేర్కొన్నారు. ఇండోర్‌ మున్సిపల్‌ అధికారి దీరేంద్ర సింగ్‌ భాయ్‌ విధి నిర్వహణలో ఉన్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్‌ విజయ్‌వార్గియా క్రికెట్‌ బ్యాట్‌తో దాడి చేసిన విషయం తెలిసిందే. తన దుందుడుకు చర్యతో విమర్శలపాలైన ఆకాశ్‌ ఇండోర్‌-3 అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 

మరిన్ని వార్తలు