శివన్‌ కంటతడి..ఓదార్చిన మోదీ

7 Sep, 2019 09:17 IST|Sakshi

సాక్షి, బెంగళూరు:  విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిని చేరుకునే అపురూప క్షణాల కోసం యావత్‌ భారతావని ఎంతో ఉత్కంఠగా వేచి చూసిన వేళ ఎదురైన చేదు ఫలితం ప్రతీ ఒక్కరి మనసును కలచివేస్తోంది.  ప్రధాని నరేంద్ర మోదీ సహా.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతీ భారత పౌరుడు ఉద్వేగానికి లోనవుతున్నాడు. ఇప్పటిదాకా చంద్రయాన్‌-2 యాత్ర అప్రతిహితంగా కొనసాగడానికి ఎనలేని కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసిస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు.

ఇక చంద్రయాన్‌-2 ప్రయోగానికి సంబంధించి అన్నీ సవ్యంగానే సాగుతున్నాయని భావించిన ఇస్రో డైరెక్టర్‌ డాక్టర్‌ కె.శివన్‌ కూడా విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోవడంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. మిషన్‌ ప్రారంభం నుంచి పడిన శ్రమ, ఇస్రో కీర్తిని.. భారత ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు వచ్చిన అవకాశం చేజారుతుందనే భావనతో చిన్నపిల్లాడిలా కంటతడి పెట్టారు. చంద్రయాన్‌-2 అంశంపై ఇస్రో టెలిమెట్రీ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌లో (ఇస్‌ట్రాక్‌)లో ప్రధాని మోదీ ప్రసంగించిన అనంతరం ఆయనను కలిసిన శివన్‌ భావోద్వేగం తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. శివన్‌ పరిస్థితిని గమనించిన ప్రధాని మోదీ ఆయనను గుండెలకు హత్తుకుని ఓదార్చారు. శాస్త్రవేత్తల అంకితభావాన్ని ఎవరూ శంకిం‍చలేరని, భవిష్యత్తులో విజయాలు సాధిస్తారంటూ ఆయనలో ధైర్యం నింపారు.

చదవండి: చంద్రయాన్‌ టెన్షన్‌.. అందినట్టే అంది..

కాగా సోషల్‌ మీడియాలో కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు, చైర్మన్‌ శివన్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. విక్రమ్ ల్యాండర్‌తో సిగ్నల్స్‌ తెగిపోయిన వేళ తల దించుకుని ఉన్న శివన్‌ ఫొటోను షేర్‌ చేస్తూ...‘మీరు సాధించింది చిన్న విషయమేమీ కాదు. మీ అంకిత భావానికి, కఠిన శ్రమకు భారత పౌరులంతా సలామ్‌ చేస్తున్నారు. మీరు తలెత్తుకుని ఉండండి సార్‌’ అంటూ ఉద్వేగపూరిత కామెంట్లు చేస్తున్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా