రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సంతాపం

7 Aug, 2018 19:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : డీఎంకే అధినేత ఎం. కరుణానిధి మరణం పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు అగ్ర నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాజీవితంలో విశిష్ట నేతగా పేరొందిన కరుణానిధి తమిళనాడుకు, దేశానికి విలువైన సేవలు అందించారని రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ ట్వీట్‌ చేశారు. కరుణానిధి మరణ వార్త తనను కలిచివేసిందని అన్నారు.

శిఖర సమానుడు : ప్రధాని
ఇక సుదీర్ఘ రాజకీయ ప్రస్ధానంలో కరుణానిధి తన జీవితాన్ని పేదలు, అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. కరుణానిధి మరణవార్త తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన దేశంలోనే అత్యంత సీనియర్‌ నేతని ప్రస్తుతించారు. కరుణానిధి ప్రజాక్షేత్రంలో వేళ్లూనుకొన్న జననేత, తత్వవేత్త, ఆలోచనాపరుడు, రచయిత, శిఖరసమానుడని ప్రధాని ట్వీట్‌ చేశారు. ఈ విషాద సమయంలో కరుణానిధి కుటుంబ సభ్యులకు, అసంఖ్యాక అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరుణానిధి మృతితో దేశం యావత్తూ, ముఖ్యంగా తమిళనాడు దిగ్గజ నేతను కోల్పోయిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు.

రాజకీయాల్లో చెరగని ముద్ర : వెంకయ్య
డీఎంకే చీఫ్‌ ఎం. కరుణానిధి మృతిపై ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. రాజకీయ దిగ్గజ నేతగా దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలం సేవలందించిన నేత కరుణానిధి కన్నుమూత తనను బాధించిందని అన్నారు. ఎనిమిది దశాబ్ధాల ప్రజాజీవితంలో కరుణానిధి 56 ఏళ్ల పాటు తమిళనాడు అసెంబ్లీ సభ్యులుగా ఉన్నారని, తమిళనాడు, జాతీయ రాజకీయాల్లో ఆయన తనదైన ముద్రవేశారని కొనియాడారు.

మరిన్ని వార్తలు