త్రివిధ దళాలకు ప్రధాని పూర్తి స్వేచ్ఛ

28 Feb, 2019 09:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ హద్దుమీరి భారత గగనతలంలోకి యుద్ధ విమానాలతో చొచ్చుకురావడంతో త్రివిధ దళాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదుపరి చర్యల కోసం పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. సరిహద్దుల్లో యుద్ధమేఘాల నేపథ్యంలో బుధవారం వరుస సమావేశాలతో ప్రధాని బిజీబిజీగా గడిపిన క్రమంలో భద్రతా దళాలు పూర్తిస్వేచ్ఛతో చర్యలు చేపట్టాలని సూచించారు. బాలకోట్‌ స్థావరంపై ఐఏఎఫ్‌ దాడి అనంతరం నెలకొన్న పరిస్థితిని త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఈ సందర్భంగా ఆయనకు వివరించారు.

దాడి అనంతరం నెలకొన్న పరిస్థితిని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు. మిగ్‌-21 ఫైటర్‌ జెట్‌ను పాకిస్తాన్‌ నేలకూల్చిన విషయాన్ని, భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ అరెస్ట్‌ చేసినట్లు పాక్‌ ప్రకటించడంపై కూడా చర్చించారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, త్రివిధ దళాధిపతులతో పాటు ఇతర సీనియర్‌ ఉన్నతాధికారులతో సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రధాని మోదీ నివాసంలో ఆయనను కలుసుకున్న త్రివిద దళాధిపతులు సరిహద్దుల్లో పరిస్థితిని వివరించారు. గడిచిన 24 గంటల్లో త్రివిధ దళాధిపతులతో ప్రధాని సమావేశమవడం అది రెండవసారి కావడం గమనార్హం. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో సరిహద్దు ప్రాంతాల్లో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. మరోవైపు దేశంలోని ప్రధాన నగరాల్లో పోలీసు, పారామిలటరీ బలగాలను మోహరించారు. పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిబిరంపై భారత్‌ వైమానిక దాడుల నేపథ్యంలో పాక్‌ నుంచి కవ్వింపు చర్యలు మొదలైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు