ప్రధాని మోదీ శరణార్థులకు 'దేవుడు': మాజీ సీఎం

23 Dec, 2019 20:34 IST|Sakshi
శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

జైపూర్‌: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు, ర్యాలీలతో దేశం అట్టుడుకుతుంటే మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మాత్రం ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. పాక్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి మతపరమైన హింసను ఎదుర్కొని భారత్‌కు తరలివచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించే చట్టంతో.. ప్రధాని మోదీ శరణార్థులకు దేవుడిలా మారారని అభివర్ణించారు. 'భగవంతుడు జీవితాన్ని ప్రసాదించాడు. తల్లి జన్మనిస్తే.. నరేంద్ర మోదీ మాత్రం పునర్జన్మను ఇచ్చారని' జైపూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
 

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించి, భయాందోళనలకు గురిచేస్తుందని తీవ్రంగా విమర్శించారు. ఇక పౌరసత్వ సవరణ చట్టంపై సోనియా గాంధీ వైఖరిని తప్పుబట్టారు. పౌరసత్వ సవరణ బిల్లు చట్టం అవ్వడానికి ముందే లోక్‌సభలో ప్రశ్నించి ఉంటే బావుండేదన్నారు. చట్టమైన తర్వాత వీడియో తీసి ప్రచారం చేయడం బాగాలేదన్నారు. తాజాగా జార్ఖండ్‌లో మారుతున్న రాజకీయ పరిణామాలు, దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను గురించి ప్రశ్నించగా.. రాష్ట్రంలోని సమస్యలపై ఎన్నికలు జరుగుతాయని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు