రాజకీయ విజేత

26 May, 2016 07:03 IST|Sakshi
రాజకీయ విజేత

సోషల్‌ మీడియా సూపర్‌స్టార్‌.. ‘ట్వీటర్‌’ భాయ్‌..
‘మన్‌కీ బాత్‌’ మోదీ నాయకత్వంలో అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ పాలనకు నేటితో  రెండు సంవత్సరాలు.
ఈ రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలేమిటి? పొందిన వైఫల్యాలేమిటి? అనే చర్చ దేశమంతటా జరుగుతోంది. రాజకీయ రంగంలో మాత్రం నిస్సంశయంగా మోదీనే విజేత. తాను సంకల్పం చెప్పుకున్న విధంగా ‘కాంగ్రెస్‌ ముక్త భారత్‌’ దిశగా వడివడిగా అడుగులేస్తున్నారు.  నానాటికీ కాంగ్రెస్‌ పార్టీ శల్యమైపోతోంది. ఆర్థిక రంగంలో మాత్రం ఆ వడి లేదు. అడుగులు ఇంకా తడబడుతున్నాయ్‌. ‘అచ్చేదిన్‌’ కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు.  

మోదీ రెండేళ్ల రాజకీయ విజయం
‘అచ్చే దిన్‌’ కోసం ఇంకా నిరీక్షణ


ఏళ్ల తరబడి మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్న దేశ ప్రజలకు ‘అచ్చే దిన్‌’ తెస్తామని.. అవినీతి ఆరోపణలు, అసమర్థ పాలన విమర్శల్లో మునిగిపోయిన ‘కాంగ్రెస్‌’ నుంచి భారత్‌ను ముక్తం చేస్తామని.. రెండు ప్రధాన నినాదాలతో ఎన్నికల్లో పోరాడి అద్భుత విజయంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ సర్కారు గురువారంతో రెండేళ్లు పూర్తి చేసుకుంటోంది. మరి ఆ లక్ష్యాల్లో ఈ రెండేళ్లలో ఎంతవరకూ సాధించారంటే..? ప్రజలకు మంచి రోజులు ఇంకా మొదలు కాలేదు కానీ.. కాంగ్రెస్‌కు గడ్డు రోజులు మాత్రం పెరిగిపోతున్నాయి. మోదీ సర్కారు ఆర్థికాభివృద్ధి రంగంలో ఇంకా ముందడుగు వేసే క్రమంలోనే ఉన్నప్పటికీ.. ఆయన కేంద్ర బిందువుగా అధికార బీజేపీ రాజకీయ రంగంలో మాత్రం బలంగా దూసుకెళుతోంది. అదే సమయంలో సామాజిక రంగంలోనూ భావజాలాల ఘర్షణ విస్తరిస్తోంది. మత అసహనం, ఆధిపత్యవాదం, జాతీయవాదం వంటి అంశాలపై విశ్వవిద్యాలయాల్లో మేధోవర్గంలో విస్తృత చర్చ జరుగుతోంది.

ఆశించినంత అభివృద్ధి లేకపోవటం, కొత్త ఉద్యోగాలు కల్పించలేకపోవటం, ధరలు పెరుగుతుండటం, అసహనతత్వం విస్తరిస్తుండటం వంటి వాటి పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ.. మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత మాత్రం కనిపించటం లేదు. పైగా మోదీ మీద సానుకూల పవనాలు ఇంకా బలంగానే కొనసాగుతున్నాయని.. ఆ కారణంగానే రాష్ట్రాల్లో సైతం బీజేపీ విస్తరిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. పైగా స్వచ్ఛభారత్, మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా వంటి భారీ కార్యక్రమాలతో పాటు సామాన్య ప్రజలకు ఆరోగ్యబీమా, రైతులకు పంట బీమా వంటి సంక్షేమ పథకాలతో ప్రజల్లో సానుకూలత సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రాభవం రోజురోజుకూ అంతరిస్తూ పోతోంటే.. బీజేపీ ప్రభావం అంతకంతకూ విస్తరిస్తోంది. నాటకీయ పరిణామాల మధ్య పట్టుపట్టి పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా తెరపైకి వచ్చి.. ఎన్నికల్లో కమలదళానికి అద్భుత విజయాన్ని సాధించిపెట్టిన నరేంద్రమోదీకి దీటైన మరో నేత.. ఆయనను ఢీ కొట్ట గల ప్రతి నాయకుడు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎవరూ కనిపించటం లేదు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కానీ, ఆమె కుమారుడు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కానీ.. మోదీ హవా ముందు తేలిపోతున్నారు.

కాంగ్రెస్‌ ప్రజాదరణ అంతరించి పోతోందా?  
2013 జూన్‌లో బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమితుడైనప్పుడు మోదీ ఒక పిలుపునిచ్చారు. ‘‘ఈ దేశాన్ని కాంగ్రెస్‌ నుంచి మనం విముక్తం చేయాల్సిన అవసరముంది. కాంగ్రెస్‌ లేని భారత్‌ను నిర్మించటం మన లక్ష్యం కావాలి’’ అని నినదించారు. అప్పటికి పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవాలో కొట్టుకుపోయింది. లోక్‌సభలో అధికారికంగా ప్రతిపక్ష హోదా అయినా పొందలేకపోయింది. అప్పటికి కాంగ్రెస్‌ పార్టీ 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. వాటిలో 11 రాష్ట్రాల్లో తానే ప్రభుత్వ సారథిగా ఉండగా.. మరో రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల సారథ్యంలోని సంకీర్ణ సర్కారులో భాగస్వామిగా ఉంది. రెండేళ్ల తర్వాత తిరిగి చూస్తే.. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏడుకు తగ్గిపోయాయి. మరొక రాష్ట్రంలో కాంగ్రెస్‌ జూనియర్‌ భాగస్వామిగా సంకీర్ణ సర్కారు ఉంది.

2014 మే 26న మోదీ ప్రధానిగా ప్రమాణం చేసేటప్పటికి.. అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, అస్సాం, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, కేరళ, మిజోరం రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ సర్కారు ఉంటే.. జార్ఖండ్, జమ్మూకశ్మీర్‌లలో కాంగ్రెస్‌తో కూడిన సంకీర్ణ ప్రభుత్వాలు ఉండేవి. ఇప్పుడు మోదీ సర్కారుకు రెండేళ్లు పూర్తయ్యేటప్పటికి.. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మణిపూర్, మేఘాలయ, ఉత్తరాఖండ్, మిజోరం, పుదుచ్చేరిలకు కాంగ్రెస్‌ పరిమితమైంది. బిహార్‌ సర్కారులో జూనియర్‌ పార్టనర్‌గా ఉంది. అయితే.. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఏడు రాష్ట్రాల్లో ఏ ఒక్కటీ ‘హిందీ హార్ట్‌ల్యాండ్‌’ పరిగణించే మధ్యభారతదేశంలో లేకపోవటం గమనార్హం. అంతేకాదు.. అందులో కర్ణాటకను మినహాయిస్తే మిగతావన్నీ చిన్నా చితకా రాష్ట్రాలే. మరొకరకంగా చెప్తే.. కాంగ్రెస్‌ను ఆదరిస్తున్న భారత ప్రజల సంఖ్య వేగంగా భారీగా పడిపోతోంది. జనాభా ప్రాతిపదికన చూస్తే.. కేవలం సుమారు 7 శాతం మంది (అందులో కర్ణాటక జనాభా 5 శాతం) దేశ ప్రజలు మాత్రమే కాంగ్రెస్‌ పాలనలో ఉన్నారు. ఆ పార్టీ జూనియర్‌ భాగస్వామిగా ఉన్న బిహార్‌ను కూడా కలిపినా కాంగ్రెస్‌ పాలనలోని మొత్తం జనాభా దేశ జనాభాలో 15 శాతానికి మాత్రమే పెరుగుతుంది. ఇది ఒక్క ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర జనాభా 16 శాతం కన్నా తక్కువ. దీనినిబట్టి.. భారతదేశం ‘కాంగ్రెస్‌ ముక్త భారత్‌’ దిశగా వేగంగా పయనిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.


అవినీతి విషయంలో..:
కేంద్ర ప్రభుత్వంలో ఎవరిపైనా అవినీతి ఆరోపణలు రాకుండా రెండేళ్లు సాగటం మోదీ సర్కారు సాధించిన ఒక విజయం. అయితే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలోని బీజేపీ ప్రభుత్వాలు, ప్రభుత్వ పెద్దలపై వచ్చిన అవినీతి ఆరోపణలు.. ఆ పార్టీ కూడా అందుకు అతీతం కాదన్న విషయాన్ని చెప్తున్నాయి. అలాగే.. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలపై రేగిన వివాదాలు.. అందులో మోదీ తన విద్యార్హతలపై వచ్చిన వివాదానికి వెంటనే ఫుల్‌స్టాప్‌ పెట్టకపోవటం ఆయన ప్రతిష్టకు కొంత చేటు చేసిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే.. ఎన్నికల హామీల్లో ప్రధానమైన నల్లధనం వెనక్కు తెస్తామన్న మాట ఇంకా నెరవేరలేదు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి, ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పరారైన బడా పెట్టుబడిదారులను వెనక్కు రప్పించటంలోనూ ఇంకా సఫలం కాలేదు.

కేంద్ర  రాష్ట్ర సంబంధాల్లో..:
మోదీ అధికారంలోకి వచ్చాక కేంద్ర – రాష్ట్రాల మధ్య సంబంధాలను పునర్నిర్వచించటం మొదలైంది. రాష్ట్రాలకు ఆర్థికంగా మరింత సాధికారం చేసేందుకు ఆయన సర్కారు పలు కీలక చర్యలు చేపట్టింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాను 42 శాతానికి పెంచటం అందులో ఒకటి. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాల విషయంలో రాష్ట్రాల అభిప్రాయానికి మరింత విలువనివ్వాలన్న నిర్ణయం సహకార సమాఖ్యను బలోపేతం చేసేదే. కానీ.. బీజేపీ లేదా ఎన్‌డీఏ యేతర పక్షాల పాలనలోని రాష్ట్రాలతో కేంద్రం ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తోందన్న విమర్శలూ ఉన్నాయి. ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో రాష్ట్రపతి పాలన విధించాలన్న నిర్ణయాలు.. ఢిల్లీ సర్కారుతో నిత్యం జగడాలు ఆ కోవలోనివే.

‘అచ్చే దిన్‌’ మున్ముందు వస్తాయా?  
ఈ రెండేళ్లలో మోదీ సర్కారు మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టింది. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ భారీగా నిధులు వ్యయం చేస్తోంది. కానీ ఉపాధి అవకాశాలు ఏమంతగా మెరుగుపడలేదు.  పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచినప్పటికీ పెట్టుబడుల రాక వేగం పుంజుకోలేదు. వీటికి తోడుగా భూసేకరణ సంస్కరణలు తెచ్చినప్పటికీ పరిశ్రమల స్థాపన మెరుగుపడలేదు. ఒకవైపు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్‌ కొనసాగుతున్నా దేశంలో క్షేత్రస్థాయిలో పెద్దగా ఫలితాలు కనిపించటం లేదు. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగానూ ఆర్థికాభివృద్ధి నెమ్మదించటమేనని చెప్తున్నారు.

ఇక గ్రామీణ ప్రాంతాల్లో 7.10 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవటం ద్వారా.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అవినీతి అవకాశాలను తగ్గించటం, ఆ ప్రయోజనాలు నేరుగా ప్రజలకే అందేలా చూడటంతో పాటు.. మరింత ఎక్కువమంది ప్రజలను, లావాదేవీలను ప్రధాన ఆర్థిక స్రవంతికి అనుసంధానం చేశారు. అయినా వారి జీవితాల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచినా వర్షాభావం, నీటికొరత, కరవు కారణంగా దేశంలో నాలుగో వంతు మంది ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఈ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే.. మోదీ సర్కారు ఇంకా మూడేళ్లు అధికారంలో ఉంటుంది కాబట్టి.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చేపట్టిన చర్యలు మున్ముందు సత్ఫలితాలు ఇస్తాయని.. అప్పుడు ‘మంచి రోజులు’ వస్తాయని ప్రభుత్వ పెద్దలతో పాటు పలువురు నిపుణులూ ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

అంతర్జాతీయ వేదికపై..:
భారత విదేశీ విధానానికి  మోదీ కొత్త జీవం పోశారనే నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయటానికి.. తద్వారా దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించటానికి మోదీ గతంలో ఏ ప్రధానీ చేయని విధంగా అనేక దేశాల్లో పర్యటించారు.  రెండేళ్లలో ఐదు ఖండాల్లోని 40 దేశాలను సందర్శించారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటూ పాక్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ జన్మదినం రోజున సైతం అనూహ్యంగా అక్కడకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపి వచ్చారు. అయితే.. పాక్‌తో సత్సంబంధాల సంగతేమో కానీ అంతర్జాతీయ వేదికపై మాత్రం భారత్‌ ప్రతిష్ట ఇనుమడించిందనే చెప్పవచ్చు.

సామాజిక రంగంలో..:
మోదీ రెండేళ్ల పరిపాలనలో ఏదైనా పెద్ద విమర్శ ఉందంటే అది సమాజంలో ‘అసహనం పెరుగుతోంద’న్న విమర్శే. ప్రధానంగా బీజేపీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఉండే సంఘ్‌ పరివార్‌ సంస్థలు, హిందుత్వ శక్తులు మత అసహనానికి పాల్పడుతున్న ఉదంతాలు ఈ రెండేళ్లలో ప్రముఖంగానే కనిపించాయి. దబోల్కర్, కలబుర్గి, పాన్సేరే వంటి హేతువాదులు హత్యకు గురవటం, బీఫ్‌ తినటంపై నిషేధం, ఘర్‌ వాపసి వంటి ఉదంతాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆయా ఘటనలపై మోదీ సర్కారు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తూ పలువురు రచయితలు, మేధావులు, కళాకారులు ప్రభుత్వ అవార్డులను వెనక్కు ఇవ్వటం పెను కలకలం రేపింది. అలాగే.. హెచ్‌సీయూలో దళిత స్కాలర్‌ రోహిత్‌ వేముల ఆత్మహత్య.. జేఎన్‌యూలో విద్యార్థి నేత కన్హయ్యకుమార్‌ను దేశద్రోహం కేసులో అరెస్ట్‌ చేయటం వంటి ఘటనలు విద్యార్థి లోకంలోనూ మేధావి వర్గంలోనూ తీవ్ర అలజడిని రేపింది.

ప్రాంతీయ పార్టీలపై గెలుపులేదు
ఇక బీజేపీయేతర, కాంగ్రెసేతర పక్షాలు 10 రాష్ట్రాల్లో – ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, కేరళ, ఢిల్లీ, త్రిపుర, నాగాలాండ్, సిక్కిం – అధికారంలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల మొత్తం జనాభా 41 శాతానికి పైనే. అయితే.. బీజేపీ ఈ రెండేళ్లలో ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ఓడించి అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఒక్క ప్రాంతీయ పార్టీని కూడా ఓడించలేకపోవటం విశేషం. సర్వశక్తులూ ఒడ్డినా ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఆమ్‌ ఆద్మీ పార్టీ), బిహార్‌లో నితీశ్‌కుమార్‌ (జేడీయూ)లను గెలవలేకపోవటం మాత్రమే బీజేపీకి ఈ రెండేళ్లలో రాజకీయంగా తగిలిన ఎదురుదెబ్బలు. అంతేకాదు.. పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జీకి (తృణమూల్‌ కాంగ్రెస్‌) కానీ, తమిళనాడులో జయలలితకు (అన్నా డీఎంకే) కానీ బీజేపీ గట్టి సవాల్‌ ఇవ్వలేకపోయింది. ఇక కేరళలో కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోయినప్పటికీ.. అక్కడ బలంగా ఉన్న వామపక్షాలు బీజేపీని పుంజుకోనివ్వలేదు. దాంతో కేవలం ఒక్క సీటు సంపాదించి ఖాతా తెరిచిన సంతోషంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. .  

నలుదిశలా వికసిస్తున్న కమలం..
మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టేటప్పటికి 7 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు 13 రాష్ట్రాల్లో సొంతంగా లేదా సంకీర్ణంగా ప్రభుత్వాలను నడుపుతోంది. వాటిలో 9 రాష్ట్రాల్లో – మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, హరియాణా, గోవా – సొంతంగా ప్రభుత్వాన్ని నిర్వహిస్తోంది. మరో 4 రాష్ట్రాల్లో – ఆంధ్రప్రదేశ్, పంజాబ్, జమ్మూకశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్‌ – సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉంది. గత లోక్‌సభ ఎన్నికల తర్వాత ఐదు రాష్ట్రాల్లో – మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్, జమ్మూకశ్మీర్, అస్సాం – బీజేపీ స్వయంగా గానీ, సంకీర్ణంగా గానీ గెలిచి అధికారంలోకి వచ్చింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ చీలిక బృందంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ 13 రాష్ట్రాలకు చెందిన జనాభా దేశ జనాభాలో 43 శాతానికి పైగా ఉన్నారు. అంటే.. జాతీయ స్థాయిలోనే కాదు.. రాష్ట్ర స్థాయిలోనూ కాంగ్రెస్‌ రోజు రోజుకూ క్షీణించిపోతుండగా బీజేపీకి ప్రజాదరణ అంతకంతకూ పెరుగుతోంది. ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అస్సాంలో గెలుపుతో ఈశాన్యంలో ఒక రాష్ట్రాన్ని తొలిసారి తమ ఖాతాలో వేసుకున్న కమలదళం.. ఇటు కేరళలోనూ ఒక అసెంబ్లీ సీటు గెలిచి ఖాతా తెరిచింది. దీంతో బీజేపీ ఇప్పుడు గుజరాత్‌ నుంచి గౌహతి వరకూ కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ విస్తరించినట్లు పలువురు పరిశీలకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు