ఆశీర్వాదం.. అమ్మతో కలిసి భోజనం

17 Sep, 2019 17:55 IST|Sakshi

గాంధీనగర్‌: దేశానికి రాజైనా.. తల్లికి మాత్రం బిడ్డే. ఈ సామెత ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో అక్షర సత్యం అనిపిస్తుంది. మిగతా రోజుల్లో ఊపిరి సలపని బాధ్యతలతో బిజీగా ఉండే మోదీ.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం తప్పకుండా తల్లి హీరాబెన్‌ను కలుస్తారు. అలానే నేడు తన పుట్టిన రోజు సందర్భంగా తల్లి సమక్షంలో కాసేపు గడిపారు మోదీ. ప్రస్తుతం మోదీ తల్లి హీరాబెన్‌.. గాంధీనగర్‌కు సమీపంలోని రైసిన్‌ గ్రామంలో చిన్నకుమారుడైన పంకజ్‌ మోదీ దగ్గర ఉంటున్నారు. ఈ క్రమంలో పుట్టిన రోజు సందర్భంగా మోదీ మంగళవారం తల్లి దగ్గరకు వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసుకుని.. ఆమెతో కలిసి కూర్చుని భోజనం చేశారు. అనంతరం తల్లితో, చుట్టుక్కల వారితో కాసేపు ముచ్చటించారు మోదీ. కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా హీరాబెన్‌ మోదీకి 501 రూపాయలను బహుమతిగా ఇచ్చారు.

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన తర్వాత మోదీ తొలుత తల్లి హీరాబెన్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పుట్టిన రోజు సందర్భంగా నిన్న రాత్రే గుజరాత్‌ చేరుకున్న మోదీ నేడు పలు కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. నర్మదా నదిపై ఉన్న సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ను, వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీతో కలిసి నమామి నర్మద మహోత్సవాన్ని ప్రారంభించారు. అలానే సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌కు సమీపంలోని బటర్‌ఫ్లై పార్క్‌ను కూడా సందర్శించారు మోదీ. ఈ క్రమంలో ఓ బ్యాగులో తీసుకువచ్చిన సీతాకోక చిలుకలను బయటకు వదిలి పెట్టారు మోదీ.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా